కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు

కేసీఆర్ ఆదేశాలతోనే ఢిల్లీకి వెళ్లానని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసులపై న్యాయవాదులతో చర్చించేందుకే పర్యటన జరిగిందన్నారు.

కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జగిత్యాల సభకు గైర్హాజరై అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లినట్లుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసు..ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం కేసులపై న్యాయవాదులతో మాట్లాడాలన్న కేసీఆర్ సూచనల మేరకు తాను ఢిల్లీకి వెళ్లడం జరిగిందన్నారు. ఓటుకు నోటు కేసులో మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డికి శిక్ష పడాలన్నారు. పట్టపగలు రూ.50 లక్షల బ్యాగుతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు కూడా మే 6వ తేదీన విచారణకు రాబోతుందని తెలిపారు. నేను ఢిల్లీకి పోతే కూడా రేవంత్ రెడ్డి మీడియా ద్వారా లీకులు ఇచ్చాడు అని, విషయం ఉన్నోడు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడని, దురదృష్టం ఎందంటే హోంమంత్రి నువ్వే, ముద్దాయి నువ్వే అన్న సంగతి రేవంత్ గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున నీకు వ్యతిరేకంగా వాదించేందుకు ఒక పేరు తెలియని న్యాయవాదిని పెట్టి, నీ తరపున అంటే ముద్దాయి తరపున ఒక పెద్ద న్యాయవాదిని పెట్టుకున్నావు అని, ప్రతిపక్ష పార్టీగా మాకు ఇవన్నీ తెల్వదు అనుకుంటున్నావా? అని హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను రహస్యంగా కలవడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు అని, నా ఢిల్లీ పర్యటనపై విచారణ చేసుకోవచ్చు.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. నా ఢిల్లీ పర్యటలనో ఎలాంటి రహస్యం లేదు అన్నారు. మన ఇద్దరి ఢిల్లీ పర్యటనలపై విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటలో రాత్రి రాహుల్ గాంధీని కలిసి, ఉదయం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిశారు అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేపు తీర్పు వస్తున్న కారణంగా, దాని పరిణామాలపై మేము సుప్రీమ్ కోర్టుకు వెళ్లాలనుకున్నామని, ఫిరాయింపుల అంశంపై కూడా సుప్రీం కోర్టుకు వెళ్లాలి అనుకుంటున్నామని తెలిపారు.

జగిత్యాలలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలపై హుందాగా మాట్లాడారని, రేవంత్ రెడ్డి కడుపు మంటతో మాట్లాడిన తీరుతో ఆయన ఏంటో ప్రజలకు అర్ధం అయ్యిందన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మంది చూశారని,.. అంటే 10% కూడా రేవంత్ ప్రసంగాన్ని వినలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం 100% ఖాయం అని, దానిని ఆపడం రేవంత్ తరం కాదు అని హరీశ్ రావు అన్నారు.

రేవంత్ రెడ్డి మొన్నటిదాకా కాళేశ్వరం కుప్పకూలింది లక్ష కోట్ల అవినీతి అన్నాడని, కానీ నిన్న రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి, రిపేర్ చేస్తా అంటున్నాడని హరీశ్ రావు గుర్తు చేశారు. నీకు కాళేశ్వరం గురించి A,B,C,D లు కూడా తెల్వదు అని రేవంత్ రెడ్డిని ఎద్దెవా చేశారు. కేసీఆర్ ఎంతో దూర దృష్టితో మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేరు మోటర్లు ఆన్ చేసేటట్టు, యావరేజ్ వర్షపాతం ఉంటే ఎల్లంపల్లి మోటర్లు ఆన్ చేసేటట్టు, కరువు ఉంటే మేడిగడ్డ మోటర్లు ఆన్ చేసేటట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. ఇప్పుడు ఎల్‌నినో ఉందని భయంతో మేడిగడ్డకు ఉరికాడని, ఈ పని ఎప్పుడో చేస్తే బాగుండు కదా అని హరీశ్ రావు చురకలేశారు.

ఇవి కూడా చదవండి :

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె…డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు