Traffic Police | హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ నిత్యం వాహనాలతో, ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు కూడా సూచిస్తుంటారు. కానీ వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంటారు.
మరి ముఖ్యంగా చాలా మంది వాహనదారులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయి. రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం కూడా సాధారణమైంది. దీంతో పాదచారులు, ఇతరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవ్ చేసే వారిపట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా 6046 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ 6 వేల మందిలో ద్విచక్ర వాహనదారులే 5,810 మంది ఉండడం గమనర్హం. త్రీ వీలర్ డ్రైవర్లు 51 మంది, ఫోర్ వీలర్ వాహనదారులు 185 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడాన్ని సిరీయస్ ట్రాఫిక్ ఆఫెన్స్ కింద పరిగణిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవించి, పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. పాదచారుల ప్రాణాలు పోవడమే కాదు.. ఇతర వాహనాలను ఢీకొట్టడం లేదా.. ద్విచక్ర వాహనదారులే భారీ వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు తెలిపారు.
