విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా కొనసాగాలనుకుంటున్న ఎంఐఎం పార్టీ ఈ దఫా తమ 7 సిటింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు రెండెంకల సీట్లను దక్కించుకోవాలని కసరత్తు చేస్తుంది. ఈ నేపధ్యంలో అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత ఎదుర్కోంటున్న నలుగురు సిటింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశమివ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. సీనియర్ నేతలు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, యాకుత్ పూరా ఎమ్మెల్యే అహ్మద్ పాషాలను తప్పించాలని ఒవైసీ నిర్ణయించుకోవడం ఆ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తుంది.
నిజానికి ముంతాజ్ ఆహ్మద్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను యాకత్‌పూరా నుంచి 2018ఎన్నికల్లో చార్మినార్‌కు మార్చారు. ఈ దఫా ఆయన టికెట్ కోత పెట్టాలని ఒవైసీ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అక్బరుద్ధిన్ ఒవైసీ ద్వారా ముంతాజ్‌కు ఈ విషయంపై సమాచారం చేరవేశారు. అయితే తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తన కుటుంబంలో ఒకరికి టికెట్ కావాలంటూ ముంతాజ్ ఆహ్మద్ పట్టుబడుతున్నారు. ముంతాజ్ కుమారుడు ఇంతియాజ్‌ఖాన్ ఈ సీటును కోరుతున్నారు. ఇందుకు ఒవైసీ సుముఖత చూపలేదు. దీంతో ముంతాజ్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి చార్మినార్ టికెట్ ఆశిస్తున్నారు.
అటు అనారోగ్యానికి గురై ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేకపోతున్నారన్న భావనతో యాకత్‌పూరా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రికి కూడా టికెట్ ఇవ్వరాదని ఒవైసీ నిర్ణయించారు. ఒవైసీ తన నిర్ణయాన్ని ఇప్పటికే అహ్మద్ పాషాకు తెలియచేయగా ఆయన సైతం అందుకు అంగీకరించారని ఎంఐఎం వర్గాలలో చర్చ సాగుతున్నది. వీరిద్ధరితో పాటు మరో ఇద్దరు సిటింగ్‌లను మార్చాలని ఒవైసీ ఆలోచిస్తున్నారు. అయితే తమకు టికెట్లు నిరాకరించబోతున్నారన్న సమాచారంతో సదరు సిటింగ్ ఎమ్మెల్యేలు లోలోపల తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని, ఒవైసీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ లో చేరి పోటీ చేయాలని వారు ఆలోచిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.
చార్మినార్ నుంచి అక్భరుద్ధిన్ ఒవైసీ కుమారుడు నూర్ ఉద్ధిన్ ఒవైసీని మూడో తరం వారసుడిగా పోటీకి దించాలని ఎంఐఎం తలపోస్తుంది. అలాగే ప్రజావ్యతిరేకత ఎదుర్కోంటున్న నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సెన్ మిరాజ్‌ను యాకత్‌పూరాకు మార్చనున్నారు. నాంపల్లి టికెట్‌ను మాజీ మేయర్ మాజిద్ హుస్సెన్‌కు లేదా సీనియర్ నేత సోహెల్‌కు ఇవ్వాలని ఒవైసీ యోచిస్తున్నారు. బహదూర్‌పూరా ఎమ్మెల్యే మౌజంఖాన్ స్థానంలో మాజీ మేయర్ జుల్పీకర్ అలీని దించనున్నారు.
కార్వాన్‌లో కౌసర్ మొహినోద్దిన్, మలక్‌పేట్‌లో బలాలకు మరో అవకాశం ఇవ్వనున్నారు. అలాగే పాతబస్తీ సహా ఎంఐఎంకు పట్టున్న రాజేంద్రనగర్, ముషిరాబాద్, జూబ్లిహీల్స్, అంబర్‌పేట్, మహేశ్వరం, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్ సహా 25స్థానాల్లో అభ్యర్థులను నిలిపాలని ఎంఐఎం భావిస్తున్నది. మిత్రపక్షం బీఆరెస్‌కు ఎన్నికల్లో మేలు చేసే వ్యూహంతో పాటు హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ స్థానంలో ఉండాలని ఒవైసీ బ్రదర్స్ వ్యూహం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చునున్నది.