ROAD ACCIDENT | రోడ్డు ప్రమాదంలో ఏకైక కుమారుడి మృతి.. విషాదంలో తల్లి.. విశ్రాంత ఐపీఎస్ నిర్వాకం
ఐదేళ్ల క్రితం భర్త మృతి చెందగా ఒక్కగానొక్క సంతానంగా ఉన్న తన కుమారుడిని ఎంతో గారాబంగా పెంచుకుంటున్న తల్లికి ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి పుత్రశోకాన్ని మిగిల్చాడు.

ROAD ACCIDENT | ఐదేళ్ల క్రితం భర్త మృతి చెందగా ఒక్కగానొక్క సంతానంగా ఉన్న తన కుమారుడిని ఎంతో గారాబంగా పెంచుకుంటున్న తల్లికి ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి పుత్రశోకాన్ని మిగిల్చాడు. పాఠశాల నుండి ఇంటికి వెళుతున్న 14 ఏళ్ల బాలుడిని ఆయన కారు ఢీ కొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనకు కారణమైన విశ్రాంత ఐపీఎస్ డి. విజయ్ కుమార్(84)ను పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్‌మెట్ సీఐ సందీప్ కుమార్ వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్ అంతయ్యకాలనీలో ఉంటున్న అమ్ములు, సుబ్బయ్య దంపతులకు ఎం. శ్రీకాంత్(14) ఒకే ఒక్క సంతానం. ఐదేళ్ల క్రితం సుబ్బయ్య చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడిని కంటికి రెప్పలా తల్లి పోషించుకుంటు వస్తుంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న శ్రీకాంత్ రామకృష్ణాపురం వంతెన వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రోడ్డు పక్కన ఆగాడు. అదే సమయంలో నేరేడ్ మెట్ నుంచి రామకృష్ణాపురం వైపు వస్తున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తన కారును నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు పక్కన నిల్చున్న శ్రీకాంత్ ను వేగంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడిని విగతజీవిగా చూసి తల్లి అమ్ములు కుప్పకూలిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కుషాయిగూడ ఏసీపీ మహేష్ న్యాయం జరిగేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.