విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల దృష్టి గ్రామీణ ఓట్లరపైనే ఉన్నది. జిల్లాల్లో పోటీ చేస్తున్న వారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు అధికంగా ఉన్నచోట నేతలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పట్టణ ఓటర్లకంటే వారే ముఖ్యమని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కొత్త ఓటర్లలో కొందరు బీజేపీకి మొగ్గు చూపే అవకాశం ఉన్నదని అంటున్నారు.
దీంతో అక్కడ ఎంత ప్రయత్నం చేసినా గెలుపు తీరాలను చేరుకోవడం కష్టమనే అభిప్రాయానికి అభ్యర్థులు వచ్చినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్ల లబ్ధిదారులు, రైతుబంధు తీసుకుంటున్నవారు, డ్వాక్రా మహిళల ఓట్లపై బీఆరెస్ అభ్యర్థులు దృష్టి సారించారని తెలుస్తున్నది. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ల ద్వారా ఏ వర్గాల వారు ఎటు వైపు ఉన్నారు? వాళ్లను తమ వైపు తిప్పుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే కాదు మంత్రుల దాకా చాలా ఏండ్లు పలకరించని వారిని, పట్టించుకోని వారికి నేరుగా ఫోన్ చేసి యోగక్షేమాలు వాకబ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. నేరుగా ఇంటికి, ఆఫీసులకు వెళ్లినా కలవని వారు ఫోన్ చేయగానే స్పందిస్తున్నారట. 100 ఓట్ల నుంచి మొదలు 500 ఓట్ల దాకా ప్రభావితం చేసే ప్రజాప్రతినిధుల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇంతకాలం తమను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మా అవసరం తెలిసి వచ్చిందా? అని ప్రశ్నిస్తే అయిందేదో అయిపోయింది ఇక నుంచి కలిసి పనిచేద్దాం. ఒకరికొకరు సహకరించుకుందాం అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అలాగే మొబైల్ అందుబాటులోకి వచ్చి సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో యువత కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా? లేదా అనుకూలంగా వచ్చే రీల్స్, పోస్టుల పట్ల ఆకర్షితులవుతారని, వారు ఎటువైపు నిలబడుతారోనన్న ఆందోళన అన్నిపార్టీల అభ్యర్థుల్లో ఉన్నది.
ఇలాంటి యువత, ఇంకా ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నవాళ్లు స్థానిక నేతలు చెబితే వినే పరిస్థితి లేదని నగరాల నుంచి రాజకీయ విశ్లేషకుల ద్వారా, విద్యావంతులు, మేధావివర్గం ఇలా ప్రధాన పార్టీలన్నీ వారిని చైతన్యపరిచే కార్యక్రమం మొదలుపెట్టినట్టు సమాచారం. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఒకప్పుడు ఒకే పార్టీ వైపే పడేవి. కానీ ప్రస్తుతం తండ్రి అభిప్రాయాన్ని కొడుకు పట్టించుకోవడం లేదు. కొడుకు వాదనను తల్లిదండ్రులు వినడం లేదట.
అందుకే ఈ పరిస్థితిని అధిగమించడానికి వారందరినీ తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈసారి కొన్నిచోట్ల ఎవరు గెలిచినా 1000 నుంచి 5000 వేల ఓట్ల మెజారిటీతోనే బైట పడుతారనే టాక్ వినిపిస్తున్నది. అందుకే ఆయా పార్టీల అభ్యర్థులకు తమకు పట్టున్న గ్రామాలు, మండలాల్లో ఎక్కువ ఓట్లు సంపాదించడానికి ఇవన్నీ పాట్లు పడుతున్నారని తెలుస్తోంది. కొన్నిచోట్ల అయితే ఎవరు గెలుస్తారు? ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే కండువాలు మార్చిన నేతలు ఎంతవరకు నిలబడుతారనే చర్చ కూడా జరుగుతున్నది.