విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నారాయణ పేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్‌కు రోజు రోజుకూ గ్రాఫ్ పడిపోతోందన్న చర్చ జోరందుకుంది. ఆపార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న ఆయన్ను గ్రామాల్లోకి రాకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు నచ్చజెప్పాల్సిన ఎమ్మెల్యే.. వారిపైనే చిందులు తొక్కడం ఈ ప్రాంతంలో దుమారం రేగింది. ‘మేము ఇచ్చే పింఛన్ పైసలతో బతుకుతూ.. మమ్మల్ని నిలదీస్తారా’ అంటూ ప్రజలపై మండిపడుతున్న సంఘటనలు పేట నియోజకవర్గంలో ఎన్నో జరిగాయి.
ఈ పరిణామాలతో ఎమ్మెల్యేపై ప్రజల్లో మరింత అసంతృప్తి రగులుకుంది. పదేళ్ల కాలంలో ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగక పోవడం కూడా రాజేందర్ రెడ్డికి మైనస్ గా మారిందనేది ప్రతిపక్షాల విమర్శ. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నారాయణ పేట నియోజకవర్గానికి సాగునీరు తెస్తానని ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజేందర్ రెడ్డికి ఊతపదంగా మారింది.
గత ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చినా, ఇప్పటికీ చుక్క సాగు నీరు పొలాలకు అందలేదు. మళ్ళీ ఇప్పుడు ఇదే అంశం తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా పదేళ్లు అవుతుందనే భావన జిల్లా ప్రజల్లో ఉంది. పాలమూరు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితిలో.. మళ్ళీ సాగు నీరు తీసుకొస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం నీటి మీద రాతలే అని ఇక్కడి రైతులు అంటున్నారు.
గ్రామాల అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండగా, ప్రజలు కలవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న ప్రజలు ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆయన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ప్రజలపై తిట్ల దండకం చేయడం విస్తుగొల్పుతోంది. పార్టీ పై అభిమానం ఉన్నా, ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడంతో ఇక్కడ బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యే తీరు ఈ ఎన్నికల్లో ఓటర్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో రోజురోజుకూ బీఆర్ఎస్ కు జనాదరణ కోల్పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వ్యతిరేకత.. కాంగ్రెస్ కు కలిసొచ్చేనా?
నారాయణ పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై ఉన్న ప్రజావ్యతిరేకత ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణికా రెడ్డికి కలిసి వచ్చే అవకాశంగా స్థానికంగా చర్చ జరుగుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంభం శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న గ్రామాల ప్రజలను శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో సఫలీకృతుడయ్యాడని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరురా తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థి తీరును ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని,పార్టీని బలోపేతం చేయడంలో తమవంతు కృషి చేసి, ఆపార్టీ అభ్యర్థి పర్ణిక గెలుపునకు బాటలు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే దిశలో నడిపించిన ఘనత శివకుమార్ రెడ్డికి దక్కుతుందని అ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.