విధాత: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. బుధవారం నుంచి శుక్రవారం మూడ్రోజులు మంచి రోజులు ఉండటంతో నామినేషన్ల జోరు కొనసాగనున్నది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నవంబర్ మూడో తేదీ నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఒక రోజు సెలవు పోగా, గడిచిన నాలుగు రోజుల్లో కొందరు అభ్యర్థులు మాత్రమే తమ నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు 100 మంది దాఖలు చేయగా, ఇంకా చాలా మంది నామినేషన్లు సమర్పించాల్సి ఉన్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఇతర ప్రముఖ నాయకులు కూడా నామినేషన్లు వేయాల్సి ఉన్నది. సీఎం కేసీఆర్ లక్కి నంబర్ 9 అయినందున ఆయన గురువారం నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల సమర్పరణకు చివరి తేదీ కూడా 10వ తేదీ కావడంతో సమయం కూడా ఎక్కువ లేదు. ఇంకా కొన్ని స్థానాలకు ప్రధాన పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు పొందిన వివిధ పార్టీల నాయకులు ఈ మూడు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు 100 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అభ్యర్థుల వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆర్‌వో కార్యాలయానికి రాకుండా నిబంధనలు పెట్టారు. అభ్యర్థిసహా ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇచ్చారు. కార్యాలయాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.