సీఎం ఇలాకాలో బీఆర్ఎస్‌కు షాక్

  • Publish Date - November 3, 2023 / 11:20 AM IST
  • ఈటల సమక్షంలో భారీ చేరికలు
  • గజ్వేల్ లో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆరెస్ కు ఆపార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కాషాయ‌ కండువా కప్పుకుంటున్నారు. శుక్రవారం మండలంలోని కాళ్లకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, కాళ్లకల్ ఎంపీటీసీ నత్తి లావణ్య దంపతులతో పాటు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్ గుప్తా, బీఆర్ఎస్ నాయకుడు కుమ్మరి నాగరాజుతోపాటు పలువురు గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.


ఈటల వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాము సొంత గూటికి రావడం సంతోషంగా ఉందని నత్తి మల్లేష్ దంపతులు ఈ సందర్భంగా అన్నారు. మనోహరాబాద్ మండలంలో బీజేపీని బలోపేతం చేస్తామని, ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈటల మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు.


కార్యక్రమంలో జిల్లా నాయకుడు వర్గంటి రామ్మోహన్ గౌడ్, అజయ్ కుమార్, మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు నరేందర్ చారి, నాయకులు ప్రభాకర్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఇలాకాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతుండగా, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆపార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.


ఐదేళ్లుగా కుంగిపోయాం


ఐదేళ్లుగా బీఆర్ఎస్ లో ఉంటూ అనేక సార్లు కుంగిపోయామని సర్పంచ్ నటి మల్లేష్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత గూటికి చేరడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం బీజేపీలో ఉంటూ కాళ్లకల్ సర్పంచుగా పోటీ చేసిన సమయంలో నత్తి మల్లేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి సర్పంచుగా గెలుపొందారు. అనంతరం ఆయన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నటి మల్లేష్ ముదిరాజ్ రెండుసార్లు సర్పంచ్ పదవి లో ఉండగా సస్పెండ్ అయ్యారు. అప్పటినుండి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ, ప్రస్తుతం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు.