సెగ్మెంట్లు మార్చడంలో సిద్ధహస్తులు.. పోటీ చేయడమే ఈ లీడర్లకు ప్రధానం

ఎన్నికలొస్తే చాలు సెగ్మెంట్ మార్చడం కొందరు నాయకులకు సాధారణమైన అంశమైంది.

  • Publish Date - November 11, 2023 / 12:17 PM IST
  • సొంత లాభమెక్కువ, పార్టీ ప్రయోజనం తక్కువ
  • వరుసగా మూడు సెగ్మెంట్లు మారిన రేవూరి
  • రెండు సెగ్మెంట్లు మారిన వారి సంఖ్య పెద్దదే



విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలొస్తే చాలు సెగ్మెంట్ మార్చడం కొందరు నాయకులకు సాధారణమైన అంశమైంది. కొందరు మాత్రం తమ పార్టీ అవసరాల కోసం నియోజకవర్గం మారిస్తే, మరికొందరు మాత్రం పోటీయే ప్రధానమని భావించి మారిన వారున్నారు. మరికొందరు మాత్రం తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల మార్పు, డీ లిమిటేషన్ వల్ల రద్దు కావడం, రిజర్వేషన్ తదితర కారణాల వల్ల మారాల్సి వచ్చింది. తాజా రాజకీయ పరిణామాల్లో ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ చర్చలు ఒకవైపు సాగుతుండగా నియోజకవర్గాలు మార్చేవారున్నారు. ఇది కొందరికి కలిసివస్తే మరికొందరికి ఆదరణ కరువైంది.


మూడు ఎన్నికలు.. మూడు సెగ్మెంట్లు


తాజా రాజకీయ పరిణామాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి వారిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ముందున్నారు. వరుసగా మూడు ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం విశేషం. 2014 ఎన్నికల్లో నర్సంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. 2014లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా నర్సంపేట సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించడంతో వరంగల్ పశ్చిమ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో ఇటీవల వేగంగా మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కొద్ది రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. పరకాల కాంగ్రెస్ టికెట్ సాధించి పోటీలో ఉన్నారు.


సెగ్మెంట్ లు మార్చిన నాయకులు వీరే


పార్టీలు మార్చిన నాయకులు చాలామంది ఉన్నప్పటికీ, ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలు మార్చిన వారి జాబితా చాలాఉంది. 1962లో తొలిసారి చేర్యాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి 1967లో జనగామ నుంచి పోటీచేశారు. 1967లో పరకాల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జంగారెడ్డి తర్వాత శాయంపేట నుంచి పోటీచేశారు. 1985లో స్టేషన్ ఘన్ పూర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 1999లో పరకాల నుంచి పోటీచేశారు.


ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ విజయరామారావు 2009లో వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. 2014లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. గతంలో గజ్వేల్ నుంచి పోటీచేశారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొండా సురేఖ గతంలో శాయంపేట, పరకాల నుంచి పోటీ చేశారు.


ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి 1994లో శాయంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా, 2014లో భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ప్రస్తుతం వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అరూరి రమేష్ గతంలో స్టేషన్ ఘన్ పూర్ పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేశారు. పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో వర్ధన్నపేట టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. 2004లో మానుకోట టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వేం నరేందర్ రెడ్డి, హనుమకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గతంలో వరంగల్ తో పాటు నర్సంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు.


వర్ధన్నపేట సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి నుంచి పోటీచేసిన తక్కెళ్ళపెల్లి పురుషోత్తమ రావు తర్వాత వరంగల్ నుంచి కాంగ్రస్ పార్టీ పక్షాన పోటీచేశారు. వర్ధన్నపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వన్నాల శ్రీరాములు వరంగల్ నుంచి ఆర్జెడీ అభ్యర్థిగా పోటీచేశారు. ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పొడెం వీరయ్య ప్రస్తుతం భద్రాచలం నుంచి పోటీచేస్తున్నారు. చేర్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కొమ్మూరి ఇప్పుడు జనగామ నుంచి పోటీచేస్తున్నారు. ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చందూలాల్ మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు.