ఖమ్మంలో బీఆరెస్‌కు మరోషాక్‌.. కాంగ్రెస్‌లోకి జలగం వెంకటరావు

  • Publish Date - October 31, 2023 / 12:42 PM IST

విధాత : ఖమ్మం జిల్లాలో బీఆరెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. కొత్తగూడెం బీఆరెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన జలగం వెంకటరావు బీఆరెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ నుంచి వెంకటరావుకు కొత్తగూడెం టికెట్‌ పై హామీ లభించడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నద్దమవుతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు.


ఇప్పుడు వారి బాటలోనే వెంకటరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఈ జిల్లాలో బీఆరెస్‌ మరింత బలహీన పడే పరిస్థితులు నెలకొన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీఆరెస్‌కు పువ్వాడ రూపంలో ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఈ దఫా పొంగులేటి, తుమ్మల, జలగం వంటి బడా నేతల వలసలతో బీఆరెస్‌ మరింత బలహీనపడనట్లయ్యింది. కేవలం ఒక్క మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సారధ్యంలోనే బీఆరెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.