కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ రచ్చ
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌లో మంటలు రాజేస్తున్నది..కాంగ్రెస్ లో మంటలు రేపిన లోకల్ అంశం జూబ్లీహిల్స్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పీజేఆర్ కూతురు పీ విజయారెడ్డి, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి తదితరులు ఈ స్థానం నుంచి పోటీకి రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతున్నది
- కాంగ్రెస్‌లో లోకల్ రచ్చ
- స్థానికుడికే ఇస్తామన్న పొన్నం
- వాయనాడ్‌లో ప్రియాంక లోకలా?
- మంత్రికి ఫిరోజ్‌ఖాన్ కౌంటర్
- జూబ్లీహిల్స్ ఆశిస్తున్న ఫిరోజ్‌ఖాన్
- ఇప్పటికే దస్తీ వేసిన అజారుద్దీన్
- రేసులో పీజేఆర్ బిడ్డ విజయరెడ్డి
హైదరాబాద్, జూలై 30 (విధాత) : త్వరలో జరగాల్సిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌లో మంటలు రాజేస్తున్నది. స్థానికులకే ఇక్కడ టికెట్ ఇస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం ఈ మంటలను రాజేసింది. పొన్నం ప్రకటనను పార్టీ నగర నేత ఫిరోజ్‌ఖాన్ తప్పుపట్టారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించిందని ఆయన అంటున్నారు. ఈ స్థానంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్లే స్థానికులకే టికెట్ అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం తెరమీదికి తెచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ రేసులో వీరే
ఈ ఏడాది జూన్ 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీకి పలువురు కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్.. మళ్లీ తానే బరిలో ఉంటానని ఇప్పటికే చెప్పుకొంటున్నారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన పార్టీ రాష్ట్ర చీఫ్ మహేశ్ గౌడ్.. ఇలా ఎవరికి వారు తామే పోటీ చేస్తామని ప్రకటించుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ మాట ఎలా ఉన్నా.. మాజీ కెప్టెన్ మాత్రం జూబ్లీహిల్స్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పీజేఆర్ కూతురు పీ విజయారెడ్డి, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి తదితరులు ఈ స్థానం నుంచి పోటీకి రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతున్నది.
కాంగ్రెస్ లో మంటలు రేపిన లోకల్ అంశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు క్యాడర్‌ను పార్టీ నాయకత్వం సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో కలకం రేపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్థానికులకే టికెట్ కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన తేల్చి చెప్పారు. అభ్యర్థి ఎవరనేది పార్టీ నాయకత్వం ప్రకటిస్తుందని అన్నారు. పొన్నం వ్యాఖ్యలపై మండిపడిన ఫిరోజ్‌ఖాన్.. ఏకంగా రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతోనే పోలిక పెట్టారు. గతంలో రాహుల్ వాయనాడ్ ఎంపీగా ఉన్నారని, ఇప్పుడు ప్రియాంక అక్కడ ఎంపీగా ఉన్నారని గుర్తు చేస్తూ.. వారిద్దరూ అక్కడి లోకల్ నాయకులా? అని ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్‌లో ఒక పద్ధతి ఉంటుందన్న ఫిరోజ్ ఖాన్.. నాయకత్వం ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేస్తున్నదని అన్నారు.
జూబ్లీ హిల్స్ టూ క్యాబినెట్?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి ఆయన పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్.. ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తద్వారా రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ కోటాలో బెర్త్ దక్కతుందనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రుల మంత్రాంగం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తరహాలో సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. ఈ ఉప ఎన్నికకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రతి డివిజన్‌కు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. 18 మంది కార్పొరేషన్ చైర్మన్‌లకు డివిజన్లవారీగా బాధ్యతలు కేటాయించారు. బుధవారం నుంచే పనిలోకి దిగాలని సూచించారు. ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి? ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతలు ఏంటి? తదితర అంశాలపై ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్లాన్ రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా చర్చించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram