కాళేశ్వరం నీటి నిల్వ మాటేంటి? ఈ ఏడాది నీటి నిల్వ లేనట్లేనా!

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆది నుంచి వివాదాస్పదమే. కట్టించిన బీఆరెస్ పాలకులు ప్రపంచ అద్భుతమంటూ ప్రచారం చేసుకోగా, ప్రతిపక్షాలు అదో తిప్పిపోతల ప్రాజెక్టు, రాష్ట్రానికి గుదిబండ కానుందంటూ విమర్శలు చేశాయి

కాళేశ్వరం నీటి నిల్వ మాటేంటి? ఈ ఏడాది నీటి నిల్వ లేనట్లేనా!
      • మరమ్మతులపై నిర్మాణ సంస్థ తూచ్‌
      • నాడు మరమ్మతు మా బాధ్యతన్నారు
      • నేడు కొత్త అగ్రిమెంట్ కావాలని కొర్రీ?
      • కాఫర్ డ్యాం నిర్మాణానికి 55.75 కోట్లు..
      • పునర్ నిర్మాణానికి మరో 600 కోట్లు!
      • బరాజ్‌ పునరుద్ధరణపై సర్కార్ మల్లగుల్లాలు
      • 20న అసెంబ్లీలో ఇరిగేషన్‌ మంత్రి
      • ఉత్తమ్‌ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌
      • త్వరలో మేడిగడ్డ బరాజ్‌ సందర్శన

      విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆది నుంచి వివాదాస్పదమే. కట్టించిన బీఆరెస్ పాలకులు ప్రపంచ అద్భుతమంటూ ప్రచారం చేసుకోగా, ప్రతిపక్షాలు అదో తిప్పిపోతల ప్రాజెక్టు, రాష్ట్రానికి గుదిబండ కానుందంటూ విమర్శలు చేశాయి. అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాల పర్వం తీరం చేరకముందే.. ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్‌) ఆక్టోబర్ 21న కుంగిపోవడం.. అన్నారం, సుందిల్ల లీకేజీలకు గురికావడంతో ఈ ప్రాజెక్టు మరింత వివాదాస్పదమైంది. మేడిగడ్డ బరాజ్‌ కుంగినప్పుడు రిపేర్ల బాధ్యత మాదేనన్ననిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇప్పుడు ఆ పని తమది కాదని, కొత్త అగ్రిమెంట్ చేసుకుని నిధులిస్తేనే పనులు జరిపిస్తామంటూ మాట మార్చడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.


      అటు సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లలో లోపాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఆదివారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మేడిగడ్డపై శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20న అసెంబ్లీలో మేడిగడ్డ బరాజ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించడం మరింత ఆసక్తి రేపుతున్నది. అలాగే త్వరలోనే మేడిగడ్డ సందర్శిస్తానని ఉత్తమ్ అధికారులకు స్పష్టం చేశారు.


      మరోవైపు మేడిగడ్డకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి చూపుతామని మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన సందర్భంలో అదేమైనా టూరిస్టు ప్రదేశమా? అంటూ బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేసి నిపుణుల కమిటీని పంపాలని సూచించారు. కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆదివారం కౌంటర్ వేస్తూ కాళే్శ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా మార్చించిందే బీఆరెస్ ప్రభుత్వమని చురకలేశారు. బస్సులు పెట్టి మరి జనాన్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను గతంలో ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లి చూపించిన గతాని కవిత మరువడం విడ్డూరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడుతుందన్న భయం కవిత మాటల్లో కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని మరోసారి తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

      మేడిగడ్డపై ఎల్‌ఆండ్‌టీ మెలిక!

      ఎన్నికల సమయంలో మేడిగడ్డ బరాజ్‌ కుంగిన సందర్భంగా బీఆరెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలలో భాగంగా ఇరిగేషన్ అధికారులను, బరాజ్‌ నిర్మించిన ఎల్‌ఆండ్‌టీ సంస్థను రంగంలోకి దించింది. ప్రాజెక్టు అధికారులు ముందుగా బరాజ్‌ కుంగడం వెనుక కుట్ర కోణం దాగివుందని పోలీస్ ఫిర్యాదుతో హడావుడి చేశారు. చివరకు సాంకేతిక కారణాలతో కుంగిందని, రిపేర్లు చేయిస్తామని ప్రకటించారు. బరాజ్‌ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ నిబంధన మేరకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మరమ్మతులు జరిపిస్తుందని పేర్కొన్నారు. అటు ఆక్టోబర్ 22న బరాజ్‌ను సందర్శించిన ఎల్‌అండ్‌టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ సైతం సొంత ఖర్చుతోనే బరాజ్‌ పునరుద్ధరణ పనులు చేపడుతామని ప్రకటించారు.


      బరాజ్‌ ఈఈ తిరుపతిరావు సైతం బరాజ్‌ నిర్వాహణ ఇంకా నిర్మాణ సంస్థ పరిధిలోనే ఉందని, రిపేర్ల బాధ్యత వారే చూసుకుంటారని ప్రకటించారు. అదే సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ నిపుణుల బృందం బరాజ్‌ను పరిశీలించి, డిజైన్ల లోపాలు, నిబంధనల మేరకు నిర్మాణం చేయనందున కుంగిపోయిందని కేంద్రానికి నివేదిక అందించింది. ఆ నివేదికపై రాష్ట్ర డ్యాం సేప్టీ అథార్టీ, ఇరిగేషన్ శాఖలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖాస్త్రం సంధించాయి. ఎన్నికల వేళ ఎక్కడ తమకు రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందోనన్న ఆలోచనతో బీఆరెస్ ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీలు కేంద్ర డ్యాం సేఫ్టీ అథార్టీతో విబేధించాయన్న ఆరోపణలు సైతం వినిపించాయి. ఇదిలా ఉండగానే బరాజ్‌లోని నీళ్లను ఖాళీ చేసి, పరిశీలన నివేదిక అందించాలని, అనంతరం తాము మరోసారి బరాజ్‌ను పరిశీలిస్తామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ.. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి, ఇరిగేషన్ సెక్రటరీకి లేఖలు రాసింది. దీనిపై రోజులు గడుస్తున్నా ఆయా విభాగాల నుంచి సమాధానం ఇవ్వలేదు.

      ఎల్ ఆండ్ టీ యూటర్న్‌తో మరింత గందరగోళం

      ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డ బరాజ్‌ పునరుద్ధరణ ఖర్చు, బాధ్యత తమదేనన్న ఎల్‌అండ్‌టీ ఎన్నికల తర్వాత డిసెంబర్ 2న రాసిన లేఖలో మేడిగడ్డ బరాజ్‌ పునరుద్ధరణ పనులతో తమకు సంబంధం లేదని ప్లేటు ఫిరాయించింది. రామగుండం ఈఎన్‌సీ ఆక్టోబర్ 25, నవంబర్‌ 25న రాసిన లేఖల విషయాల మేరకు పునరుద్ధరణ పనులు చేయాలంటే కొత్తగా తమ సంస్థతో ఈపీసీ అగ్రిమెంట్ చేసుకోవాలని మెలిక పెట్టింది. కుంగిన ఏడో బ్లాక్ వద్ద కాఫర్ డ్యామ్ కట్టడానికి 55.75 కోట్లు ఖర్చవుతుందని, దీనికి జీఎస్టీ, సివరేజీ ఖర్చులు అదనమని పేర్కొన్నది. పెరిగిన ధరలు, మెటీరియల్ లభ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ అంచనా మేరకు మేడిగడ్డ ఏడో బ్లాకులో 11 పిల్లర్ల పునరుద్ధరణకు కనీసంగా 600 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పుడు రిపేర్ల ఖర్చంతా ప్రభుత్వమే భరించాల్సివుంది.


      మెలిక వెనుక?

      ఎల్‌ఆండ్‌టీ భిన్న ప్రకటనలపై రచ్చ మొదలైంది. ముందుగా రిపేర్ల బాధ్యత తమదేనని, ఇప్పుడు కాదని మాటమార్చడం వెనుక అసలు కారణలేమిటన్నదానిపై చర్చ సాగుతున్నది. ఎన్నికల వేళ బీఆరెస్ ప్రభుత్వమే బరాజ్‌ కుంగుబాటు డ్యామేజ్ నుంచి బయటపడేందుకు ఎల్‌అండ్‌టీతో రిపేర్ల బాధ్యత ఆ కంపెనీదేనని ప్రకటన చేయించిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పుడు ఎల్‌అండ్‌టీ లేఖలో చెబుతున్న మేరకు బరాజ్‌ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అధికారికంగా కూడా ఎల్‌అండ్‌టీ పరిధిలో లేదు. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణం 2018 ఆగస్టు 25కల్లా పూర్తి చేయాలని అగ్రిమెంట్ చేసుకోగా, పలు కారణాలతో 2020 జూన్ 29నాటికి నిర్మాణం పూర్తి చేశామని, 2021మార్చి 15వ తేదీతో బరాజ్‌ పనులు పూర్తయినట్లుగా ఎస్‌ఈ తమకు ధృవీకరణ పత్రం ఇచ్చారని ఆ సంస్థ వెల్లడించింది.


      నిర్మాణ ఒప్పందం మేరకు సివిల్ పనులకు ఏదైనా నష్టం జరిగితే బరాజ్‌ ఇరిగేషన్ శాఖకు హ్యాండోవర్ చేసిన 24 నెలల వరకే కంపెనీ బాధ్యత ఉంటుందని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 జూన్ 29 నుంచి 2022 జూన్ 29 వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు ఎస్‌ఈ కూడా 2021 మార్చి 15వ తేదీన బరాజ్‌ను హ్యాండోవర్ చేసుకున్నామని ధృవీకరించినందున ఈ తేదీని కూడా పరిగణలోకి తీసుకున్నా 2023 మార్చి 15తోనే ఆ పీరియడ్ ముగిసిపోయిందని, ఈ కారణంగా అక్టోబర్ 21న కుంగిన బరాజ్‌ మరమ్మతులకు, తమకు సంబంధం లేదని ఎల్‌అండ్‌టీ తేల్చి చెప్పింది. మేడిగడ్డ బరాజ్‌ మరమ్మతుల బాధ్యత తమది కాదంటూ ఎల్‌అండ్‌టీ డిసెంబర్ 2న లేఖ రాస్తే.. కొత్త ప్రభుత్వం వద్ద అధికారులు ఇంతకాలం ఆ లేఖను ఎందుకు దాచారన్నదానిపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వంలోనూ సీఎం రేవంత్‌, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ రెండుసార్లు చేసిన సమీక్షలోనూ ఈ లేఖను వారి దృష్టికి అధికారులు తీసుకెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల నిర్మాణ లోపాలు రెండేళ్ల కిందటే గుర్తించినా ఇరిగేషన్ శాఖ పెద్దలు వాటిని దాచి పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. వారే ఇప్పుడు ఎల్‌అండ్‌టీ లేఖను కూడా తొక్కిపెట్టారని అంటున్నారు.

      నీటి నిల్వ అసాధ్యమే

      3,348 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ రెండేళ్లకే మరమ్మతులకు గురికావడం, అన్నారం, సుందిల్ల కూడా సురక్షితం కాదని, వాటిల్లో నీటి నిల్వలు తగ్గించుకోవాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ చేసిన సూచనలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కుంగిన మేడిగడ్డ బరాజ్‌ ఏడో బ్లాకులోని 11 పిల్లర్ల మరమ్మతుల కోసం నీళ్లను ఖాళీ చేయించారు. ముందుగా కాఫర్ డ్యాం నిర్మించి, తర్వాత మరమ్మతులు చేపట్టాలి. అయితే నదిలో నీటి ప్రవాహం మరో రెండునెలల పాటు కొనసాగుతుండటం.. తర్వాత మూడు నెలల గరిష్ఠ సమయం మాత్రమే ఉండటంతో ఈ మధ్య కాలంలో బరాజ్‌ కుంగుబాటుపై విచారణలు చేసి, మరమ్మతుల ప్రకియను సాగించడం అసాధ్యంగా కనిపిస్తున్నది. దీంతో యాసంగితోపాటు రానున్న ఖరీఫ్‌లోనూ బరాజ్‌లో నీటి నిల్వ అసాధ్యంగా కనిపిస్తున్నది. అటు కొత్తగా మరో 600 కోట్లు ఖర్చు పెట్టి మేడిగడ్డను పునరుద్ధరించితే వచ్చే ప్రయోజనాలేమిటి? నిర్వహణ ఖర్చు ఎంత? సాగునీటి ప్రయోజనం ఎంత? అన్న లెక్కలతో ప్రభుత్వం బరాజ్‌ మరమ్మతులపై మల్లగుల్లలు పడుతున్నది.

      రాష్ట్ర ఖజనాకు గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కంటే ప్రాణహిత‍‍‍ చేవెళ్లను చేపట్టడం మంచిదా? అన్న కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది.