బోధన్ లో అలా…కొడంగల్ ఇలా..సర్ పై సందేహాలు: కవిత ఫైర్

సర్ ప్రక్రియపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కొడంగల్‌లో డూప్లికేట్ ఓట్లు, బోధన్‌లో భారీగా ఓట్లు తొలగింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సర్(స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్) ప్రక్రియ రాజకీయ లక్ష్యాల మేరకు జరుగుతున్న ప్రక్రియగా కనిపిస్తుందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సర్ ప్రక్రియ కొనసాగుతుందని విమర్శించారు. సోమవారం మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో.. గత సంవత్సన్నర కాలంలో తొలగించిన ఓట్లు కేవలం 808 మాత్రమేనని, అయితే అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు 7 వేల ఓట్లు ఎలా తొలగించారని కవిత వెల్లడించారు. ఈ ఓట్ల తొలగింపు వ్యత్యాసం గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా సాగిందన్న అనుమానాలకు తావిస్తోందని కవిత వ్యాఖ్యానించారు.

మా పార్టీ సర్వేలో కొడంగల్ నియోజకవర్గంలో 22,433ఓట్ల డబుల్ ఓట్లు ఉన్నాయని, మేం వాటి నుంచి 1000ఓట్ల వివరాలను ఫోటోలతో సహా సేకరించాం అని తెలిపారు. 2018 నుంచి 2023లలో 33వేల ఓట్ల పెరుగుదలపై అనుమానాలతో.. సరిహద్దులో ఉన్న కర్ణాటక సెడం నియోజకవర్గం ఓటర్ల జాబితాను పోల్చి చూస్తే పేరు, జెండర్ ఒకే రీతిలో అక్కడ 11వేల ఓట్లు ఉన్నాయని, కొడంగల్, సెడమ్ నియోజకవర్గంలోని డబుల్ ఓట్లు కలిపితే 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయని తేలిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచిన మెజార్టీ 32,532 మాత్రమే కావడం గమనార్హం అని, ఇదంతా చూస్తుంటే ఎన్నికల సంఘం సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయని కవిత తెలిపారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ కు నిధులు మాత్రమే కాదు..సెడమ్ నుంచి కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి ఓట్లు కూడా అందినట్లుగా కనిపిస్తుందని కవిత ఆరోపించారు. కర్ణాటక నుంచి నోట్ ట్రాన్స్ ఫర్ మాత్రమే కాకుండా ఓట్ ట్రాన్స్ ఫర్ జరిగిందని కవిత ఆరోపించారు.

ఓటు డిలీట్ చేయాలనుకుంటే ఓటర్లకు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం ఎంతవరకు సరైందని కవిత ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఓ రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో సర్ నిర్వహిస్తుందని, దీంతో ఓ రాష్ట్రంలోని ఓటర్లు మరో రాష్ట్రానికి వచ్చి సర్ ప్రక్రియలో రెండు చోట్ల ఓట్లను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాదు ఒక కుటుంబానికి సర్ ద్వారా ఒకే బూత్ లో ఓట్లు ఎందుకు కేటాయించకపోతుందో ఎన్నికల సంఘం ఆలోచించాలని కవిత సూచించారు. హైదరాబాద్ కి వచ్చేసిన ఆంధ్రా వాళ్లకి ఒక్క దగ్గర మాత్రమే ఓటు హక్కు ఉండాలని మా పార్టీ కోరుతుందన్నారు. ఏపీలో ఉంటే హైదరాబాద్ లో డూప్లికేట్ ఓటు ఉండకూడదని, హైదరాబాద్ లో ఉంటే ఏపీలో డూప్లికేట్ ఓటు ఉండకూడదని మేం డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మైగ్రేంట్ ఓటర్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

Latest News