ఏడాదిలో ప్రభుత్వ పతనం.. రేవంత్‌కు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌: కేసీఆర్‌

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని, దున్నపోతును తెచ్చిపెట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ అన్నా

  • Publish Date - April 16, 2024 / 10:19 PM IST

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్లే
ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని,
దున్నపోతును తెచ్చుకున్నారు
అప్పుడప్పుడు లిల్లిపుట్‌లు గెలుస్తారు
రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారేమో
అంబేద్కర్‌ జయంతి రోజున నివాళులేవి?
మోసం చేసినవారికే సద్దికడితే ఆగమైతం
పోలీసులు జాగ్రత్త.. మళ్లీ వచ్చేది మేమే
హామీల అమలుకు పోస్ట్‌కార్డ్‌ ఉద్యమం
ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

సంగారెడ్డి : గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని, దున్నపోతును తెచ్చిపెట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. అప్పుడప్పుడు లిల్లిపుట్‌గాళ్లు గెలుస్తారంటూ కాంగ్రెస్‌ విజయాన్ని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేల్లో వెల్లడవుతున్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీలో కలిసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో బీఆరెస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలోని మూడో అధికరణం కారణమని గుర్తు చేశారు. కానీ.. అంబేద్కర్‌ జయంతి రోజున అంబేద్కర్‌ స్మృతివనంలో అతిపెద్ద బాబా సాహెబ్‌ విగ్రహం వద్ద ప్రభుత్వం తరఫున ఒక్క పువ్వును కూడా ఉంచలేదని కేసీఆర్‌ విమర్శించారు. అందుకే తాను వీళ్లను లిల్లీపుట్‌లని అంటున్నానని చెప్పారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారన్న దుగ్ధతోనే కనీసం ఎవరూ దండలు వేయలేదని ఆరోపించారు. కానీ.. తాము నిర్మించిన సెక్రటేరియట్‌లో ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే క్వార్టర్లు కూడా తామే కట్టించామని, అందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టాక తొలి జయంతి ఇది అని, అంబేద్కర్‌ను అవమానించిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

మోసం చేసినవారికే సద్దికడితే ఆగమైతం
ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్‌ కోరారు. మన కండ్ల ముందే మనల్ని మోసం చేస్తుంటే.. మళ్లా వారికే సద్ది కడితే, ఓట్లు వేస్తే ఆగమవుతామని హెచ్చరించారు. సంగమేశ్వర, బసవేశ్వర పూర్తి కావాలన్నా, కరెంట్‌ మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ గెలిచిందని తమకేమీ ఓర్వలేని తనం లేదని, వారు కూడా ఐదేండ్లు అధికారంలో ఉండాలని కేసీఆర్‌ అన్నారు. అప్పుడే నల్లదేందో, తెల్లదేందో తెలుస్తుందని చెప్పారు. కానీ.. రేవంత్‌రెడ్డి మాటలు చూస్తున్నా, సభల్లో ఆయన వణుకుడు చూస్తున్నా తెలంగాణ జనం తిరగబడ్డదని అర్థమవుతున్నదని అన్నారు.
రేవంత్‌ సర్కార్‌ ఏడాది కూడా ఉండదు
ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని, అన్ని జిల్లాల్లో రైతాంగం తిరగబడుతున్నదని పేర్కొన్నారు. అందుకే నారాయణపేట సభలో సీఎం భయం చూస్తుంటే ఈ గవర్నమెంట్‌ ఏడాది కూడా ఉండేటట్టు లేదని అన్నారు. ‘ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో.. ముఖ్యమంత్రే జంప్‌ కొడుతడో.. ఏమైతదో తెలియని పరిస్థితి. సీఎం ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు. అక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటు వేయమని చెబుతుండు. ఏం జరుగుతంది? ఎవరు ఎవరికి బీ టీమ్‌? ఎవరెవరు కలిసిపోయారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏమరుపాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతంది. ఇంకా మోసపోతే డెబ్బతింటం’ అని కేసీఆర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా కొనసాగే అవకాశం లేదని కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు రేవంత్‌కు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు కూడా వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్‌ నేతల్లో కూడా భయం నెలకొందని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు పోస్ట్‌కార్డ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీఆరెస్‌ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే సహించబోమని అన్నారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఈ విషయాన్ని పోలీసులు మరచిపోవద్దని చెప్పారు. ‘మీరు మారకుంటే ప్రజలే తిరగబడే రోజు వస్తుంది.. తస్మాత్‌ జాగ్రత్త’ అని హెచ్చరించారు. ‘పోలీసుల మిత్రులకు మనవి చేస్తున్నా.. మీ డ్యూటీ మీరు చేయండి. పదేళ్లు మేం గవర్నమెంట్‌లో ఉన్నం. అమాయకులను బెదిరించడం, కొట్టడం.. బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు పీకేయడం ఇదా మీ డ్యూటీ? ఇవాళ మేం కూడా లెక్కబెడుతున్నాం. నేను పోలీస్‌ పేరెత్తంగనే ప్రజలు ఎలా స్పందిస్తున్నరో మీరు చూస్తున్నరు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్‌ చేయండి. జాగ్రత్త మళ్లీ గ్యారంటీగా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది. మీ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకోవాలి’ అని అన్నారు.

రుణమాఫీ ఏది?
డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని కేసీఆర్‌ గుర్తు చేశారు. డిసెంబర్‌ 9 ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. వీళ్లను వంగదీసి.. మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆరెస్‌ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీనికోసం పార్లమెంటులో బీఆరెస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడే బీఆరెస్‌ ఎంపీలు అవసరం
తాను రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు పోరాట పటిమను మెతుకు సీమ అందించిందని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఏడు సీట్లలో గెలిపించారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆరెస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నదని కేసీఆర్‌ చెప్పారు. ఆనాడు తాను ఎంపీగా పార్లమెంటులో గర్జించకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. తెలంగాణ హక్కులు నెరవేరాలంటే మన బిడ్డలు పార్లమెంటులో ఉండాలని చెప్పారు. మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న బీఆరెస్‌ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, అనిల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Latest News