నేడో రేపో బీజేపీ నాల్గవ జాబితా: కిషన్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ 88మంది అభ్యర్థులను ప్రకటించిందని మిగిలిన అభ్యర్థులతో నాల్గవ జాబితాను నేడోరేపో వెల్లడిస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

  • Publish Date - November 5, 2023 / 08:53 AM IST
  • సీఎం ఒప్పుకుంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ
  • బీసీ సీఎం మా ఎజెండా
  • జనసేనతో పొత్తులో వెలుతున్నాం
  • కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ 88మంది అభ్యర్థులను ప్రకటించిందని మిగిలిన అభ్యర్థులతో నాల్గవ జాబితాను నేడోరేపో వెల్లడిస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి అజెండాతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.


తెలంగాణకు బీసీ నేత ను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ఈ ఎన్నికల్లో హుజురాబాద్ ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆరెస్ పోయి పోయి కాంగ్రెస్ వస్తే పెనం మీద నుంచి పోయిలో పడట్లేనని, పాలనలో మార్పు రాదన్నారు. కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ.. బీఆర్ఎస్ కొనుకునే పార్టీ అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తోనే ప్రారంభించారని తెలిపారు.


కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పూర్తి అవగాహన ఉందని, 2004లో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వం కలసి పనిచేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు.


తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందని, దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్‌ మాట తప్పారని, నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని, రాష్ట్రంలో ప్రజలు సీఎంను కలిసే అవకాశమే లేదని అన్నారు. సచివాలయానికి కూడా కేసీఆర్‌ రావట్లేదని, పదేళ్లుగా ఒక టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఉద్యోగ భర్తీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.


టీఎస్పీఎస్సీ విఫలమైందని 17 పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపారు. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారన్నారు. కేసీఆర్‌ కామారెడ్డి ,గజ్వేల్ లో ఓడిపోతారన్నారు. రుణమాఫీతో 30% మంది రైతులకు కూడా లాభం జరగలేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి తాళాలు వేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షకోట్లు గోదావరి పాలు చేశారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ లో ఉన్న పది టీఎంసీల వాటర్ ఖాళీ చేశారన్నారు.


కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఈరోజు సాయంత్రం వరకు సీబీఐ విచారణకు ఆదేశించే బాధ్యత నాది అన్నారు. సీబీఐ నేరుగా దర్యాప్తు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. రెండు గంటలకు సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తు కోరుతూ సంతకం చేస్తే నాలుగు గంటల లోపు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే బాధ్యత నాదన్నారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కనీసం వెళ్లడం లేదన్నారు.


మనవడిని భద్రాచలం పంపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కర్ణాటకలో గ్యారెంటీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తుందన్నారు. వేలకోట్లు తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్‌ తరలిస్తుందన్నారు.


కేసీఆర్ ఏపీ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని, కేంద్రం నిధులివ్వకుంటే తెలంగాణలో రోడ్లు ఎక్కడివని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్‌హెచ్‌లు, రైల్వేల అభివృద్ధికి.. రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులిచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకమని చెప్పారు. జనసేనఎన్డీయే భాగస్వామి కాబట్టే ఆ పార్టీతో పొత్తు ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పొత్తు ధర్మంగా జనసేనతో కలిసి ఎన్నికలకు వెలుతున్నామన్నారు. 80శాతం రాష్ట్ర ఆదాయంతోనే మేం అభివృద్ధి చేశామని చెబుతున్న సీఎం కేసీఆర్‌తో కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. దమ్ము, ధైర్యముంటే సీఎం కేసీఆర్‌ చర్చకు రావాలన్నారు.