విధాత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ‘లక్ష కోట్లు అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన 4 ఏళ్ళకే ప్రమాదంలో పడింది. నాణ్యత, నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగింది. ప్రాజెక్ట్ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సీబీఐతో విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ ప్రాజెక్ట్ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆరోపించారు. శనివారం పార్టీ నేతలు కే లక్ష్మణ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ తో కలిసి ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్ట్ వైఫల్యాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
కాళేశ్వరం నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ‘ఇదో ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. దీని నిర్మాణం పేరుతో వేలకోట్లు దుర్వినియోగం చేశారు’ అని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తిన ఫలితమే ప్రస్తుత ప్రాజెక్టు దుస్థితికి కారణమన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ ప్రాజెక్టు గుదిబండలా మారిందని, దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రీ డిజైనింగ్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని గోదావరి పాలు చేశారని దుయ్యబట్టారు.