మాట మీద నిలబడని కాంగ్రెస్‌.. ఓటమి నుంచి బయటపడని బీఆరెస్‌

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాటమీద నిలబడలేదని, పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వాటిని ఆగస్టులో అమలు చేస్తామంటూ గారడి మాటలు చెబుతుందని

  • Publish Date - April 20, 2024 / 07:33 PM IST

కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

విధాత, హైదరాబాద్‌ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాటమీద నిలబడలేదని, పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వాటిని ఆగస్టులో అమలు చేస్తామంటూ గారడి మాటలు చెబుతుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటేయొద్దని అన్నారు. గ్యారెంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంటుందని అగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారని దుయ్యబట్టారు. జూన్ నెలలో ఎన్నికోల కోడ్ అయిపోగానే రూ.2 లక్షల రుణమాఫీ చేయకుండా అగస్ట్ 15 వరకు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. అరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటేయొద్దని సూచించారు. బీఆరెస్ ఓడిపోయి 5 నెలలు గడిచినప్పటికి ఓటమిని కేసీఆర్, కేటీఆర్ ఇంకా అంగీకరించడం లేదన్నారు. కుమార్తె లిక్కర్ కేసు, ఫోన్ల ట్యాపింగ్ కేసుల్లో ఆ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో బీఆరెస్‌ ఉందన్నారు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచినోళ్లు బీఆరెస్‌లో చేరగా, ఇప్పుడు బీఆరెస్‌లో గెలిచినోళ్లు కాంగ్రెస్‌లోకి వెలుతున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రజలకు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను ముందే ప్రకటించామని, మోదీ ఇప్పటికే ఐదు సభల్లో పాల్గొన్నారని, త్వరలో మోదీ, అమిత్ షా సహా ముఖ్య నేతలు మరిన్ని సభలకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు.

Latest News