కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెంగాణ కేబినెట్ లో మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి…ఈ విషయంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ గాంధీతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తానన్న కాంగ్రెస్ హైకమాండ్ హామీని ఆయన మరోసారి గుర్తు చేసి కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం.
ఈ నెలలో తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ నేతలు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. పలువురు మంత్రుల శాఖల మార్పు, ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వడంపైన కూడా ఈ సందర్బంగా చర్చలు ముగిశాయి. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డిలు రాహుల్ గాంధీ, ఖర్గేలను కలవడం గమనార్హం.
వారితో పాటు మంత్రి పదవుల రేసులో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ విజయశాంతి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ లు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు కూడా మంత్రి పదవుల రేసులో వినిపిస్తుంది.