రాజగోపాల్‌ పోటీచేసేది మునగోడా? ఎల్బీనగరా?

  • Publish Date - October 23, 2023 / 12:51 PM IST

విధాత‌: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాషాయపార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్‌ చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీనిపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు. ఆయన పార్టీ వీడుతారన్నది ఊహించిందే. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోమటిరెడ్డికి కనువిప్పు కలిగించింది. ఉప ఎన్నిక సందర్భంగా అక్కడి ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. రేవంత్‌ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌ చేయడంపై ఆ పార్టీ అధిష్ఠాన నిర్ణయంపై నిరసనతో ఆయన కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే.


బీజేపీ హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల నుంచి తమ పార్టీకి వలసలు పెరుగుతాయని ఆశించింది. కానీ అదేమీ జరగలేదు. దీంతో కోమటిరెడ్డిని మునుగోడులో రాజీనామా చేయించి అక్కడ గెలువడం ద్వారా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేయాలని చూసింది. అప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమతో టచ్‌లో ఉన్నారని జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు చెబుతూ వస్తున్నారు.


మునుగోడులో కాషాయ జెండా ఎగురవేసిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు తేవాలన్నది ఆ పార్టీ అధిష్ఠాన వ్యూహం. కానీ కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఎదుర్కొన్న మొదటి ఎన్నిక అది. ఆయన తన పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్న కాలమది. ఆ సమయంలో పార్టీ ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన గులాబీ బాస్‌ అక్కడ వామపక్షాల ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది.


సీపీఐ, సీపీఎం నేతలతో మాట్లాడి మద్దతు సంపాదించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ద్వితీయశ్రేణ నాయకత్వం పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఈ పరిణామాలను రాజగోపాల్‌రెడ్డి ఊహించలేదు. అప్పుడే తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. ఉప ఎన్నికలో గెలువడానికి ఆయన అన్న భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి ద్వారా కూడా యత్నించారు.


ఎన్నిచేసినా అవన్నీ బెడిసి కొట్టాయి. బీఆర్‌ఎస్‌ అక్కడ విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా 23 వేలకు పైగా ఓట్లు సంపాదించింది. తన ఓటమికి బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కారణమన్న అంచనాకు రాజగోపాల్‌రెడ్డి అప్పుడే వచ్చారు. ఇంకా ఆ పార్టీలోనే ఉండి సాధారణలో ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసినా ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమౌతుందని తెలుసు. అందుకే చివరికి పార్టీని వీడాలని చూసినా సమయం సందర్భం కోసం ఎదురుచూశారు.


ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అందులో రాజగోపాల్‌రెడ్డి పేరు లేదు. దానికి కారణం ఆయన ఈసారి అక్కడ తన సతీమణికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. కానీ బీజేపీ హైకమాండ్‌ ఆయనను మునుగోడు నుంచే పోటీ చేయాలని ఆదేశించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి తన కొంత సమయం కావాలని కోమటిరెడ్డి కోరారు.


అందుకే మొదటి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. మునుగోడు నుంచి కంటే ఆయన ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అక్కడ పోటీ చేయడానికి ఇప్పటికే పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడ ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్‌లోనే పోస్టర్లు అంటించిన విషయం తెలిసిందే. ఆయన నిజామాబాద్‌కు వెళ్లిపోవాలని ఆ పోస్టర్ల సారాంశం. అయితే అక్కడ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఢీ కొట్టడానికి బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ కూడా కసరత్తు చేసింది.


మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కడి ప్రభాకర్‌రెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. కానీ వాళ్లు గట్టి పోటీ ఇచ్చినా గట్టెక్కలేరన్నది తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి కూడా ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు 50 శాతానికి పైగా ఉంటారు. దీంతో తన గెలుపు ఈజీ అవుతుందని ఆయన భావన. ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా రాజగోపాల్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి అక్కడి నుంచే పోటీ చేయించాలని చూస్తున్నారు.


కాంగ్రెస్‌ తొలి విడుతలో ప్రకటించిన 55 మంది జాబితాలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో పోరాడిన బీసీ నేతల పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమౌతున్నది. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువమంది బీసీలకు టికెట్లు ఇస్తుందని ప్రకటించినా పాతబస్తిలో ఓడిపోయే నాలుగైదు సీట్లను అందులో చూపడంపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మధుయాష్కిని కాదని రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడానికి అంగీకరిస్తుందా? దానిపై మధుయాష్కి స్పందన ఎలా ఉండబోతున్నది? అనేది తెలియదు.


అయితే రాహుల్‌గాంధీకి మధుయాష్కి చాలా సన్నిహితుడు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి సీటు ముఖ్యమని ఆయనను ఒప్పించవచ్చు. స్థానిక నాయకత్వం కూడా రాజగోపాల్‌ అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలుపకపోవచ్చు అంటున్నారు. రాజగోపాల్‌కు ఎల్బీ నగర్‌ టికెట్‌ ఖరారుపై కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి సిగ్నల్స్‌ అందితే ఆయన పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది. అయితే ఆయన మునుగోడు నుంచి పోటీచేస్తారా? లేక ఎల్బీ నగర్‌ నుంచా అన్నది కూడా అప్పుడే తెలుస్తుంది.