వరంగల్ తూర్పు కాంగ్రెస్‌దే: కొండా సురేఖ

తెలంగాణాలో బీఆరెస్, బీజేపీపై వ్యతిరేకత రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తుందని కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు అన్నారు.

  • Publish Date - November 11, 2023 / 11:53 AM IST
  • కాంగ్రెస్ లో చేరిన తాజా, మాజీ కార్పొరేటర్లు
  • అదే బాటలో మరికొంతమంది అధికార, ప్రతిపక్షాల నేతలు
  • బీఆరెస్, బీజేపీ వ్యతిరేకతే కాంగ్రెస్ ను గెలిపిస్తుంది
  • కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ, మురళీధర్ రావు




విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణాలో బీఆరెస్, బీజేపీపై వ్యతిరేకత రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తుందని కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు అన్నారు. శనివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ తూర్పు అధికార పార్టీ బీఆరెస్ కు చెందిన చెందిన తాజా, మాజీ కార్పొరేటర్లు, పలువురు పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


అనంతరం మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీఆరెస్ పార్టీ నాయకుడు గోపాల నవీన్ రాజు, కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, బత్తిని వసుంధర, తత్తరి లక్ష్మణ్, బాసాని శీను, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బిల్ల పవన్, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, జన్ను ప్రసన్న, బ్లాక్ నాయకుడు గోరంటల రాజు, 23వ డివిజన్ ప్రెసిడెంట్ కొక్కుల సతీష్, తోట వేణు తదితరులు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడం శుభ సూచకం అన్నారు.


వరంగల్ తూర్పులో అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. నిరుద్యోగం పెరిగి జీవనోపాధి లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అధికారం హంగూఆర్భాటాలే తప్ప సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వరంగల్ నగరం చిన్న వర్షాలకే ముంపునకు గురవుతున్నప్పటికీ, ఇప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని, వరదల సమయంలో మాత్రమే హడావిడి చేయడం.. ఆ తర్వాత సమస్యను పట్టించుకోలేదని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతో ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరులో ఉందని అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మోసపూరిత హామీలకు లొంగకుండా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎలాంటి ఆపద స‌మయంలోనైనా తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సురేఖను ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలియజేశారు.