అంబేద్కర్ ఆశయ సాధనకు పదేళ్లు పనిచేశాం

ప్రజా పోరాటంతోనే సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం

  • Publish Date - April 14, 2024 / 02:37 PM IST

125అడుగుల విగ్రహ ఏర్పాటుతో స్ఫూర్తిని చాటాం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ : ప్రజా పోరాటంతోనే సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేసిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో జరిగిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని వారి చిత్ర పటానికి కేటీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామని గుర్తు చేశారు. విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందని ప్రగతి తోనే సమానత్వం వస్తుందన్న అంబేద్కర్‌ ఆలోచనతో 1022 గురుకులాలు నెలకొల్పామన్నారు. వీటినుంచి బయటకు వచ్చిన లక్షలాది మంది భవిష్యత్తు తెలంగాణ పౌరులు ఈరోజు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని చెప్పారు. వీరందరూ జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలగుతాయన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని చాటామన్నారు. మేము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అనే మాటను మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. మహాత్మ గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అన్నారు.కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి మనమందరం గుర్తు తెచ్చుకోవాలని, అంబేద్కర్ ఆధునిక భారతదేశ జాతిపిత అనేటువంటి మాట చెప్పిందన్నారు. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్పూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని, రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా కలిసి అంబేద్కర్ ఆలోచనల కోసం ఆయన ఆశయాల కోసం కలిసి ముందుకుసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News