విధాత, హైదరాబాద్ : అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి తరుచు తనపై చేస్తున్న విమర్శల పట్ల బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటైన కౌంటర్ వేశారు. కామారెడ్డి బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చిన అని, యస్, మా అయ్యా పేరు కేసీఅర్..తెలంగాణ బాపు కేసీఆర్…ఉద్యమ నాయకుడు కేసీఆర్.. బరాబార్ నేను తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన బిడ్డనని చెప్పుకున్నారు. నీ లెక్క ఆంద్రోళ్ల బూట్లు నాకి, సంచులు మోసి రాలేదని, చవట పనులు చేసి.. దొంగ పనులు చేసి..పలు పార్టీలు జంప్‌లు కొట్టి.. రాంగ్ రూట్ లో రాలేదన్నారు. 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చానని రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ వేశారు. చేతగాని వాడినైతే మళ్లా నేను సిరిసిల్లలో గెలుస్తానా..? ఐదుసార్లు గెలిపించారని, కారు కూతలు, రోత మాటలు వద్దు.. ముఖ్యమంత్రిలాగా మాట్లాడు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
రాహుల్ గాంధీ అమ్మ, అయ్య పేరు చెప్పుకోని బతుకుతుండని, అంత ఎందుకు నీ పక్కన ఉన్న శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ వాళ్ల అయ్యల పేర్లు చెప్పుకొని వచ్చారని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ల అన్న పేరు.. భట్టి విక్రమార్క వాళ్ల అన్న మల్లు అనంత రాములు పేరు చెప్పుకుని వచ్చారని గుర్తు చేశారు. దొంగల మధ్య ఉన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు కేటీఆర్.
ప్రజలు మోసగాళ్లనే నమ్మారు
అసంబద్ధ హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని కేటీఆర్ విమర్శించారు.మోసగాళ్ళలో నిజాయితీ మోసగాడు రేవంత్ రెడ్డి అని, మోసం చేస్తానని చెప్పి మరీ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు అని రేవంత్ రెడ్డి టీవీల్లో చెప్పారని, ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు.. ప్రజలు కోరుకునేది మేం చేస్తాం అని రేవంత్ చెప్పిండని, ఆయన నిజాయితీగా చెప్పిండు, మోసగాడైనా నిజాయితీగల మోసగాడు రేవంత్ రెడ్డి.. మోసం చేస్తా అని చెప్పిండు మోసం చేసిండు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే ముచ్చటను మనం ప్రజలకు సక్రమంగా చెప్పలేకపోయామన్నారు. గొర్రెలు కసాయిలను నమ్ముతాయని.. అట్లనే మోసపోయేటేళ్లు మోసం చేసే వాళ్లనే నమ్ముతారు అని తెలిపారు. పొంకనాల పోతిరెడ్డి లాగా రేవంత్‌రెడ్డి ఎన్నో మాటలు చెప్పిండని, రూ. 2 లక్షల రుణం తెచ్చుకుంటే డిసెంబర్ 9న మాఫీ చేస్తానని పొంకనాల పోతిరెడ్డి నరికిండని, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 పాయే.. మార్చి 9 కూడా పీకిందని, ఇప్పుడు మనం రేవంత్ చెప్పిన తేదీ యాది చేస్తే.. ఏవేవో మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. యాది చేస్తాం.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే నీ భరతం పడుతాం అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి బొంద తవ్వేది ఆడబిడ్డలే..
ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం ఇస్తానని రేవంత్ ఎన్నికల సమయంలో చెప్పిండని, మూడు నెలలు అవుతుంది.. ఇంత వరకు తులం బంగారం ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులే ఇస్తున్నారని, రూ. లక్షనే ఇస్తుండు. బంగారం లేదు.. మన్ను లేదని, వంద రోజులు నిండిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బొంద తవ్వేది ఈ ఆడబిడ్డలే అని చెబుతున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ టైం పట్టదని, మార్చి 17కు వంద రోజుల సినిమా పూర్తవుతదని, మహాలక్ష్మి కింద ఇంట్లో కోడళ్లు ఉంటే రూ. 2500 ఇస్తా, అత్తలకు నెలకు రూ. 4 వేలు, వారి భర్తలకు రూ. 4 వేలు ఇస్తా అని రేవంత్ చెప్పిండని, మరి మహాలక్ష్మి ఎక్కడికి పోయిందని నిలదీశారు. రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తా అని చెప్పాడని, ఇప్పుడు యాసంగి పంట కోతకు వస్తుందని, నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే.. ఎన్నిల కోడ్ వచ్చే లోపు బోనస్ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో రైతుల సమస్యల పెరిగిపోయి ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైందన్నారు.
పార్లమెంటు ఎన్నికలతో మళ్లీ కారు జైత్రయాత్ర
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన స్పీడ్ బ్రేకర్ దాటేసి పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డిలో తిరిగి మన జైత్రయాత్ర మొదలు పెట్టాలని కేటీఆర్ కేడర్‌ను కోరారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, బాల్కొండ, బాన్సువాడలో బీఆరెస్ గెలవగా, బోధన్, జుక్కల్, కామారెడ్డిలో స్వల్ప తేడాతో ఓడిపోయామని, పార్టీలో విబేధాలతో కొంత నష్టం జరిగిందన్నారు. కామారెడ్డి చేదు జ్ఞాపకాన్ని మరిచిపోయి భవిష్యత్తు వైపు ఆశాజనకంగా సాగాలన్నారు. కామారెడ్డి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అందరికీ అందుబాటులో ఉన్న గంప గోవర్ధన్ మీకు అండగా ఉన్నారని, ఆయన నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు పోవాలని కేటీఆర్ వెల్లడించారు.