KTR : వారు పార్టీ మారారు..ఇవిగో రుజువులు

పార్టీ మార్చిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి రాహుల్ గాంధీ ఇచ్చిన స్వాగతాన్ని గుర్తుచేశారు.

విధాత, హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి – “ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా?” అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు “మేము కాంగ్రెస్‌లో చేరలేదు” అని చెప్పడాన్ని కేటీఆర్ ఈ పోస్టులో ప్రశ్నించారు. అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు, మీరు దీన్ని ఒప్పుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. “ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే, ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. ఈ ద్వంద ప్రమాణాలపై రాహుల్ గాంధీకి సిగ్గు లేదని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.