దేవుళ్లపై కాదు.. భార్యాపిల్లలపై రేవంత్ రెడ్డి ఒట్టు వెయ్యాలి

రైతులకు రుణమాఫీ చేస్తామని, దేవుళ్ళపై ఒట్టేయడం కాదు.. నిజంగానే అమలు చేస్తామనే ధైర్యం ఉంటే ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని మీ భార్యా,బిడ్డలపై ఓటు వేయండి

  • Publish Date - April 25, 2024 / 09:42 PM IST

*కోనారావుపేట రోడ్ షో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

*మార్పు కోరుకుని ప్రజలు ఆగమయ్యారు

*కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది

*ఆరు గ్యారెంటీలు ఎక్కడపోయాయి

*కూట్లే రాయితీయనోడు ఏట్లే రాయి తీస్తాడా

*ఐదేళ్లలో బండి సంజయ్ ఐదు కొత్తలు తేలేదు

విధాత బ్యూరో, కరీంనగర్: రైతులకు రుణమాఫీ చేస్తామని, దేవుళ్ళపై ఒట్టేయడం కాదు.. నిజంగానే అమలు చేస్తామనే ధైర్యం ఉంటే ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని మీ భార్యా,బిడ్డలపై ఓటు వేయండి
అంటూ బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని అన్నారు.మహిళలకు 2500, కళ్యాణలక్ష్మీ పథకంతో పాటు తులం బంగారం, రెండు లక్షల రుణమాఫీ, పెన్షన్ 4000 లకు పెంపు వంటి హామీలు ఏమయ్యాయని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గంటల వ్యవసాయరంగానికి నిరంతర కరెంటు ఇస్తే, కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. ప్రాజెక్టులను ఎండబెట్టి వ్యవసాయానికి కనీసం సాగునీరు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఇప్పుడు పాలిచ్చే బర్రెను అమ్ముకుని దున్నపోతును కొనుక్కున్నట్టు అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అధికరంలోకి వచ్చి 150 రోజులు అయినా రుణమాఫీ లేదు..ఆరు గ్యారెంటీ లు అమలు లేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధునే రైతులకు ఇయ్యనోడు ఇప్పుడు 2లక్షల రుణమాఫీ చేస్తాడా… కూట్లే రాయితీయనోడు ఏట్లే రాయి తీస్తాడా అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ప్రజల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు.. మోడీ హామీలు ఏమయ్యాయన్నారు. బులెట్ రైళ్లు ఎక్కడ పోయాయి, పదేళ్ళలో దేశ ప్రజలకు మోడీ సర్కారు చేసింది ఏం లేదని, చేసింది ఏమిటో చెప్పుకోలేకనే ఇప్పుడు దేవుళ్ళ పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేల్లలో ఏ ఊరికైనా వచ్చాడా…అసలు బండి ఏం చేశాడని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.బండి సంజయ్ ఒక్కనాడైన పార్లమెంట్ కు పోయి ప్రజా సమస్యలపై ప్రశ్నించారా? అని నిలదీశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పమంటే సంజయ్ జై శ్రీరామ్ అంటాడు.. దేవుడిని అడ్డం పెట్టుకుని మోడీ ,బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యాదగిరి గుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆ విధంగా చూస్తే తామే అసలైన భక్తులని, అలాగని దేవుడి పేరు చెప్పి కేసీఆర్ ఏనాడైనా ఓట్లు అడిగారా అని ప్రశ్నించారు.కేసీఆర్ తాను చేసిన అభివృద్ధిని మాత్రమే చూపించారు తప్ప..దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేయలేదన్నారు. ప్రజలు మోడీ మాయలో పడొద్దని ఆయన అన్నారు.

బీజేపీ పార్టీ 1980లో పుట్టిందని…. శ్రీరాముడు త్రేతాయుగంలో పుట్టారని… ప్రధాని మోడీ దేశానికి తాము చేసిన అభివృద్ధి చెప్పలేకనే దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది అమిత్ షా చెప్పులు మోసేవాడు కాదు…కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి చేసేవాడు కావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ సమస్యలపై పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు బోయినపల్లి వినోద్ ను ఎంపీగా గెలిపించాలన్నారు. పెన్షన్ల పెంపు మాట దేవుడెరుగు,సీఎం రేవంత్ రెడ్డి వారి జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టాడని, రైతులకు రైతుబంధు ఇప్పటికి పడలేదన్నారు. రాబోయే రోజుల్లో రైతుబంధు, దళితబంధు ఎగ్గొడతారని చెప్పారు.

లోకసభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీసం12ఎంపీ సీట్లు అప్పజెప్పితే, ఏడాదిలోపు రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. చీకటి ఉంటేనే… వెలుగు విలువ తెలుస్తుందని అన్నారు. సిరిసిల్లలో ఇద్దరు నేతకార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, కాంగ్రెస్ వచ్చాక నాలుగు నెలల్లోనే నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలవుతున్నాయన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని, ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోసపోవద్దన్నారు.

Latest News