పండిన ప్రతి గింజను కొనేదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టం
డిక్లరేషన్ పేరుతో రైతులను వంచించిన రాహుల్, రేవంత్
-వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం
విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రైతుల పంటను కొంటారా? వారి చేతుల్లో తన్నులు తింటారా? అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణ రైతన్నల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయొద్దని, చివరి గింజ దాకా కొనేదాకా వదిలిపెట్టేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ ను పరుష పదజాలంతో విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ఇచ్చిన మే 6వ తేదీ సందర్భంగా వరంగల్ లో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ సదస్సు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాలర్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులను తన్ని తరుముదాం తప్ప ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దన్నారు. రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే రైతన్నల కష్టాలను పట్టించుకోవాలన్నారు. పంటను కొనుగోలు చేయలేని చేతగాని దద్దమ్మ. దగుల్బాజీ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రైతు హామీలు ఇచ్చి డిక్లరేషన్ పేరిట ఓట్లు దోచుకొని ఢిల్లీకి పారిపోయారని, ఆయనఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
రైతు భరోసా, రైతు రుణమాఫీ, పంటలకు బోనస్, పంటల కొనుగోళ్లు, యూరియా సరఫరా, కరెంటు కోతలు ఇలా రాష్ట్ర రైతాంగం పూర్తి సంక్షోభం దిశగా పోతున్నదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేల్కొని రైతన్నల కష్టాల పైన దృష్టి సారించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలు ఇంత అవస్థలు పడుతుంటే సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీ రైతు వారోత్సవాలు, రైతు మేళాల పేరిట టైం పాస్ చేస్తున్నదన్నారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. రైతు బంధు రావడం లేదు కానీ రాహుల్ గాంధీకి నెల టంచనుగా డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంలో చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని సవాలు చేస్తే, పారిపోయిన పిరికిపంద అని కేటీఆర్ అన్నారు.
ఎరువులు ఇవ్వడం చేతకాని ఎదవల సర్కార్ అంటూ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల నిరసనతో వెనక్కి తగ్గిందని స్వయంగా ప్రధాన మంత్రి క్షమాపణ కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ సదస్సు సందర్భంగా తీర్మానాలు చేశారు. రైతన్నల పంటలను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, ఆత్మహత్యలకు సంతాపం ప్రకటించి రైతు మరణాల పాలైన రైతన్నలకు 10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ ను సంపూర్ణంగా అమలు చేయాలని, రైతుల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా బకాయిలు చెల్లించాలని కోరారు.
ఈ సదస్సులో బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, బండా ప్రకాష్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నన్నపునేని, పోచంపెల్లి, కవిత, శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రియాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
