రోడ్డు మీద చేపలు… పట్టినోళ్లకు పట్టినన్ని…
ఉచితంగా చేపలు, అవీ కొరమీనులు. నడిరోడ్డుపై వందల సంఖ్యలో ఎగురుతున్నాయి… అంతే, జనం విరగబడ్డారు. దొరికినవి దొరికినట్లు సంచుల్లో నింపుకున్నారు. తోపులాట, పోలీసులు. మరిపెడలో ఆరోజు అందిరి ఇళ్లల్లో చేపల పులుసే..

మహబూబాబాద్ (Mahabubabad)జిల్లా మరిపెడ (Maripeda) వాసులకు ఉన్నట్లుండి అదృష్టం ఎగురుకుంటూ వచ్చింది. వరంగల్(Warangal) నుండి ఖమ్మం(Khammam)కు బతికున్న కొర్రమీను చేప(Korameenu fish)లతో వెళుతున్న డిసిఎం మరిపెడ ఊళ్లో నడిరోడ్డు మీద అడ్డంగా (Overturned)పడిపోయింది. దాంతో అందులో ఉన్న చేపలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోయాయి. అవన్నీ ఖరీదైన కొర్రమీను చేపలు. పైగా ప్రాణంతో ఉన్నాయి. ఇంకేం… జనాలు తండోపతండాలుగా వాటిపై దాడి చేసారు. ఎవరికి దొరికినవి వారు పట్టుకుపోయారు. దీంతో వరంగల్–ఖమ్మం హైవే మీద మరిపెడ వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ (Traffic Chaos) ఏర్పడింది. రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
ఇక పోలీసులు రంగప్రవేశం చేయక తప్పింది కాదు. అప్పటికీ ఇంకా చేపల వేట కొనసాగుతూనే ఉంది. వారినందరినీ చెదరగొట్టిన పోలీసులు, ముందుగా తిరగబడిన వ్యాన్ను తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయాల్సివచ్చింది.
మొత్తం మీద ఇదంతా ఓ నాలుగు గంటల ప్రహసనంగా మారిపోయింది. కొర్రమీను ప్రస్తుతం కిలో 500 రూ. పై చిలుకు ధర పలుకుతుండడంతో తీసుకెళ్లినవారు కిలో 200 రూ.లకు అమ్ముకున్నట్లు తెలిసింది. అమ్మేవరకు అమ్మి, వండుకునే వరకు వండుకుని ఆ రాత్రి మరిపెడ అంతా చేపల పులుసు గుబాళింపులో, వేపుడు సువాసనలతో దద్దరిల్లింది.