ప్రాణం తీసిన ప్రేమ..యువకుడి దారుణ హత్య

ప్రేమ వ్యవహారం ఓ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ప్రాణం తీసింది. సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో అర్ధరాత్రి యావన్‌ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

విధాత, హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం ఓ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ప్రాణం తీసింది. సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో అర్ధరాత్రి యావన్‌ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యావన్‌ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆందోళనకారులు యువతి ఇంటిపై దాడి చేసేందుకు బయల్దేరడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపు చేశారు. యవన్ ను హత్య చేసిన వారిలో అతను ప్రేమించిన యువతి సోదరుడు పరమేశ్​, ఆమె బావ సాయిలు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారు యవన్ ను హత్య చేయడంతో హత్య ఫోటోను డీపీగా పెట్టుకోవడం గమనార్హం.

ప్రియురాలి ఫోన్ కాల్ తో నిందితులపై క్లారిటీ

హత్యకు గురైన యవన్ కు ప్రియురాలు చేసిన ఫోన్ కాల్ బయట పడగా..అందులో తన కుటుంబ సభ్యులు నీపై దాడికి దిగవచ్చని హెచ్చరించింది. దీంతో యవన్ కుటుంబ సభ్యులు నిందితులపై ఆగ్రహంతో రగిలిపోతూ వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్​ జోన్​ అడిషనల్​ డీసీపీ నరసయ్య తెలిపారు. గతంలో నిందితులను 307 కేసుతో అరెస్ట్ చేశామని… వారిపై అనేక కేసులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రాథమికంగా హత్యలో ఐదుగురు ఉన్నట్లు తెలిసింది. దీని వెనక సుపారి ఇచ్చి ఏమైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

అసలు ఏం జరిగింది..?

జవహర్‌నగర్‌కు చెందిన యావన్‌ (23) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్​కు చెందిన ఓ యువతిని పాఠశాల స్థాయి నుంచి నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు యావన్‌ను హెచ్చరించారు. అయినా అతను సీతాఫల్‌మండి ఇందిరానగర్‌లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై యావన్‌ ఇంటికి వచ్చి టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని బయటకు పరుగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నా కొడుకు ప్రాణం ఎలా కొట్టుకుందో… తల్లి రోధన

‘నా కొడుకుకి రేపు పరీక్ష ఉందని… బీటెక్​ మూడో సంవత్సరం చదువుతున్నాడని, ఇంతలోనే హత్యకు గురయ్యాడని మృత్యుడి తల్లి బొమ్మల దుర్గ వాపోయింది. . ఏదైనా పంచాయతీ ఉంటే పెద్దలకు చెప్పి మాట్లాడాలి కానీ అలా కత్తులతో చంపడం ఏంటని రోధించింది. హత్య చేసిన వారంతా చిన్న వయసు వారే అని..నా కొడుకుని చంపేటప్పుడు వాడి ప్రాణం ఎంత గిలగిలా కొట్టుకుందోనంటూ ఆమె చేసిన రోధన స్థానికులను కలిచివేసింది.

Latest News