తూటా పేలితే ఓరుగల్లు గుండెజల్లు.. రెండు వారాల్లో ఇద్దరు నేతల మృతి

దశాబ్దాలుగా విప్లవోద్యమంలో భాగస్వామ్యమైన మావోయిస్టు పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా తల్లులు కడుపుకోతకు గురవుతున్నారు

  • Publish Date - April 17, 2024 / 08:26 PM IST

మొన్న సాగర్, నిన్న రామారావు
మూడున్నర దశాబ్దాలుగా అజ్ఞాతం
కడుపుకోత మిగుల్చతున్న ఎన్ కౌంటర్లు
సీఎం రేవంత్ అప్రజాస్వామిక పాలన
మావోయిస్టు రాష్ట్ర నేత జగన్ విమర్శ

విధాత ప్రత్యేక ప్రతినిధి: దశాబ్దాలుగా విప్లవోద్యమంలో భాగస్వామ్యమైన మావోయిస్టు పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా తల్లులు కడుపుకోతకు గురవుతున్నారు. దండకారణ్యంలో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలు నిర్జీవులుగా మారుతున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతం నిత్యం నెత్తురోడుతోంది. ఆకుపచ్చని అడవి రక్తంతో ఎర్రబారుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి దండకారాణ్యం లక్ష్యంగా సర్కారు సాయుధ బలాగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. అటవీప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలతో జల్లెడ పడుతున్నారు. ఒక్క నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. మూడున్నర నెలల నుంచి 71 మంది మృతి చెందారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, తెలంగాణ, ఏపీ, ఒరిస్సా సరిహద్దు పదేహేను రోజుల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో నక్సలైట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు పొగొట్టుకున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట తూటాల మోత లేకుండా తెల్లారడంలేదని తేలుతోంది. ఈ తూటల్లో తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ నాయకులు ప్రాణాలిడిచారు. మొన్న అంకుశాపురం బిడ్డ, నిన్న చల్లెగరిగె బిడ్డ మృతి చెందారు.

ఎక్కడ పేలినా ఓరుగల్లు గుండెజల్లు

సంఘటన ఎక్కడ జరిగినా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తల్లులకు గుండెకోత మిగులుతోంది. దండకారణ్యంలో ఏ మూల ఎన్ కౌంటర్ జరిగినా అందులో వరంగల్ బిడ్డలు అమరులైతున్నారు. ఇటీవల జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలిడిచారు. ఒక్కొక్కరు మూడున్నర దశాబ్దాలుగా మావోయిస్టుపార్టీలో పనిచేస్తున్న వారు కావడం గమనార్హం. సాధారణ సానుభూతి పరును స్థాయి నుంచి ప్రారంభించి కార్యకర్తగా మావోయిస్టు పార్టీలో చేరి ఆ తర్వాత దండకారణ్యంలో మంచి నాయకులుగా ఎదిగిన వారు కావడం విశేషం. కర్రెగుట్ట వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో భూపాలపల్లి జిల్లాకు చెందిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ చనిపోయారు. ఇదిలా ఉండగా కాంకేర్ జిల్లా బీనాగూడా, చోటాబేటియా అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎన్ కౌంటర్ లో భూపాల్ పల్లి జిల్లాకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ రావు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు తలపెడుతున్న కాగార్ దాడిని నిరసిస్తూ ఈనెల 15వ తేదీన బంద్ తెల్లవారే ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

15 రోజుల్లో ఇద్దరు నేతల మృతి

పదిహేను రోజుల వ్యవధిలోనే ఇద్దరు వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 5వ తేదీన చత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం కర్రగుట్ట సమీపంలో గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీకి చెందిన మధ్య రీజనల్ కంపెనీ -2కి చెందని కమాండర్ అన్నె సంతోష్ (శ్రీధర్, సాగర్), ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు కా. ఆప్కా మనీరామ్, పీఎల్జీఎ సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు.

అన్నె సంతోష్ అలియాస్ సాగర్

అన్నె సంతోష్ (శ్రీధర్, సాగర్) భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, అంకుశపురం గ్రామంలో జన్మించాడు. స్థానిక భ్యూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 2000లో సిపిఐ ఎంఎల్ (పీపుల్స్ వార్) పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. 24 సంవత్సరాల విప్లవ జీవితంలో ఆర్గనైజేషన్ లో రెండు సంవత్సరాలు తరువాత యాక్షన్ టీమ్, స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ దళంలో, ప్లటూన్, కంపెనీ వంటి మిలటరీ రంగా నిర్మాణాల్లో వివిధ స్థాయిల బాధ్యతలను నిర్వహించాడు. కోరాపూట్, దామన్ జోడి, మురికినార్ పోలీసు స్టేషన్లపై చేసిన రెయిడ్స్, బీర గూడెం లాంటి ఆంబూష్ ల వంటి అనేక గెరిల్లాయుద్ధ చర్యల్లో పాల్గొన్నారని ఆ పార్టీ ప్రతినిధి జగన్ ప్రకటించారు.

సిరిపెల్లి సుధాకర్ అలియాస్ రామారావు

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ రావు తాజా ఎన్ కౌంటర్లో అసువులుభాశారు. మంగళవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో సుధాకర్ మృతి చెందారు. దీంతో స్వంత గ్రామం చల్లగరిగలో కలకలం రేగింది. సిరిపెల్లి ఓదేలు రాజ పోచమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కాగా సుధాకర్ హైస్కూల్ చదువుతున్నప్పుడే అప్పటి పీపుల్స్ వార్లో సానుభూతిపరుడుగా మారారు. తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్ సహచర్యతో శంకర్రావు 1997-లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుధాకర్ తండ్రి ఓదేలు మృతి చెందగా తల్లి రాజ పోచమ్మ వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవిస్తుంది. చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్, రౌతు విజేందర్, కలికోట శంకర్ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో పనిచేశారు. గతంలోనే శంకర్, విజేందర్ ఎన్ కౌంటర్లో మృతిచెందగా తాజా ఎన్ కౌంటర్లో సుధాకర్ మత్యువాతపడ్డారు. సుధాకర్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆయన భార్య కూడా మృతిచెందారనే ప్రచారం సాగుతోంది.

విప్లవ ప్రతిఘాతుక కాగార్ ఆపరేషన్: జగన్

దేశంలో ఎన్డీఏ, ఇండియా కూటములు మధ్య అధికారం కోసం పోట్లాటలున్నప్పటికీ మావోయిస్టు పార్టీని నిర్మూలించడం, సామ్రాజ్యవాదుల, ఘరాన కార్పోరేట్ల దోపిడికి కొమ్ము కాయడంలో బీజేపి, కాంగ్రెస్ లు మధ్య తేడా ఏమిలేదు. కేసిఆర్ నిరంకుశ పాలన పోవాలంటే నక్సలైట్లు రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి, నరెంద్రమోడీని, ఆదానిని కలిసిన తరువాత నక్సలైట్లు తీవ్రవాదులుగా కనబడుతున్నారు. నరేంద్రమోడి, అమిత్ షాల నాయకత్వంలో కొనసాగిస్తున్న కౄరమైన విప్లవ ప్రతిఘాతుక కగార్ దాడిలో విప్లవకారులను హత మార్చడానికి దాడులకు పూనుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటనలో ఆరోపించారు.

Latest News