ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ఘనత : కేటీఆర్‌

  • Publish Date - October 28, 2023 / 11:01 AM IST

విధాత‌: ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని, తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్‌ స్థానంలో ఉందన్నారు. తొమ్మిదేళ్ల కిందటి పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని.. 9 ఏళ్లలో రాష్ట్రంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని స్పష్టం చేశారు.


తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్న కేటీఆర్‌.. సంపద పెంచడం, పేదలకు పంచడమే కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని.. పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఐదుగంటలు ఇవ్వడం లేదని విమర్శించారు. వృద్ధిరేటులో రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు.


అప్పులపాలు చేశారనడం సరికాదు


కొందరు నాయకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. గతేడాదితో పోలిస్తే ఐటీ ఎగుమతులు రూ.57వేల కోట్లు పెరిగాయని, ప్రతి ఏడాది 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ రంగంలో 26వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నామనన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తీసుకువచ్చామని, సంపద సృష్టించడం కోసమే రుణాలు తెచ్చినట్లు స్పష్టం చేశారు.


అప్పుల మొత్తం సాగునీటి రంగం, మిషన్‌ భగీరథకు వినియోగించినట్లు చెప్పారు. దాంతో ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. తెలంగాణ నుంచి రూ.2.41 లక్షల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. పట్టణాలతో పాటు పల్లెలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి జాతీయ అవార్డుల్లో తెలంగాణకే సింహభాగం దక్కాయని చెప్పారు. 7.7శాతం గ్రీన్‌ కవర్‌ పెంచడం దేశంలోనే అద్భుతమైన విషయమన్నారు.


మేడిగడ్డ బరాజ్‌ కుంగుబాటుపై..


దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల ఉపాధి కల్పన జరిగిందన్న కేటీఆర్‌.. హైదరాబాద్‌ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే వచ్చాయని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్న ఆయన.. 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఐదేళ్లు పూర్తయ్యిందని.. ప్రజలకు సంబంధించి ఒక్కపైసా వృథా కాదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలపై ఎలాంటి భారం పడదని, ఒక్కపైసా భారం పడకుండా ఏజెన్సీనే పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని బ్యారేజ్‌ నిలబడిందని.. ఇటీవల నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బ్యారేజ్‌ పరిశీలించిందన్నారు. కాళేశ్వరం చివరి ఆయక్టటుకు నీళ్లు అందుతున్నాయని.. ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరికావన్నారు.


సోనియాను బలిదేవత అన్న రేవంత్‌


గతంలో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అణచివేసిందని.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని ఆరోపించారు. వందల మంది బలిదానాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడ్డదన్నారు. సోనియాగాంధీ బలిదేవత అని రేవంత్‌రెడ్డి అన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటపడుతుందన్నారు.

రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పదేళ్లలో 10వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాల చొప్పున ఇచ్చానని.. జిల్లాలో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఐదు వైద్య కళాశాలలు ఉండేవన్నారు. కేంద్రంలో బీజేపీకు ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారని.. ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.


అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నామని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఏమందని ప్రశ్నించారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న హామీ ఏమైందంటూ నిలదీశారు. కాంగ్రెస్‌, బీజేపీలకు అభివృద్ధిపై ఓ విజన్‌ లేదని.. అధికారం కోసం అర్రాజ్‌ పాటలా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌పైనే ప్రజలకు నమ్మకం ఉందన్నారు. తాము చేసిన పనులు చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నామని.. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు.


గతంలో పాలమూరు వలసలకు పర్యాయపదం


కర్నాటక మోడల్‌ను కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారని.. ఆ రాష్ట్ర రైతులే తెలంగాణకు వచ్చి ఆందోళన చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కర్నాటక వెళ్లి అక్కడి రైతుల పరిస్థితిపై ఆరా తీసేందుకు సిద్ధమా? అంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేశామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గతంలో వలసలకు పాలమూరు పర్యాయపదంగా ఉండేదని.. ఇవాళ ఇరిగేషన్‌కు పర్యాయపదంగా మార్చినట్లు తెలిపారు.


రేవంత్‌రెడ్డి కేసులపై కేటీఆర్‌ స్పందిస్తూ.. తాము పగ, ప్రతీకార రాజకీయాలు చేయడం లేదన్నారు. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారన్నారు. తెలంగాణలో సంతులిత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతోందన్నారు. కులం కంటే గుణం.. ముఖ్యమన్న కేటీఆర్‌.. ఏ కులం వారు సీఎం అయితే ఆ కులానికి మేలు జరుగుతుందా? అంటూ ప్రశ్నించారు. బీసీ ప్రధాని అయితే ఓబీసీలకు ఏమైనా మేలు జరిగిందా ? అంటూ ప్రశ్నించారు. రేపు బీజేపీ ఓడితే బీసీలపై నెపం నెట్టే కుట్ర జరుగుతుందన్నారు.