Ponguleti Srinivas Reddy । రెండు నెలల్లో భూమాత పోర్టల్: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదని, ఏపి లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పడిపోయిందనేది అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. గత మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూ వస్తున్నదని, వచ్చే మూడు నెలలు పెరుగుతుందని, రెవెన్యూ లోటు అంతగా లేదని అన్నారు.

Ponguleti Srinivas Reddy । మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే, అదే సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలపై ప్రసంగించాలని అనుకున్నానని, అది నెరవేరే అవకాశం కన్పించడం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిట్టూర్చారు. అసెంబ్లీ లాబీలో శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు, అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనాలని పిలిచేందుకు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పంపించామన్నారు. మంత్రి ప్రభాకర్ తో రెండు గంటల పాటు ముచ్చటించి, మర్యాద చేసి పంపించారు కాని తెలుగు తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కాలేదని, అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ సమావేశాలకు హాజరైతే, ఆయన ముందు ప్రసంగించాలని ఉబలాటపడ్డానని, ఆ ఆశ నెరవేరేటట్టు లేదన్నారు. కేసీఆర్ సభకు రాకుండా కొసరును పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్వోఆర్2024
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్2024) బిల్లును ప్రవేశపెడ్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణి స్థానంలో కొత్తగా ఆర్వోఆర్2024ను తీసుకువస్తున్నామని, భూ యజమానులకు ఉపయోగపడే విధంగా కొత్త చట్టం ఉంటుందని అన్నారు. ఆర్వోఆర్ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి కొన్ని సూచనలు చేసినందున, వాటిలో మార్పులు చేస్తున్నామని ఆయన వివరించారు. అయితే సోమవారం నాడు అసెంబ్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్వోఆర్2024 బిల్లును ప్రవేశపెట్టడం లేదని, అయితే ఈ సమావేశాల్లోనే బిల్లును సభ ముందు పెట్టి చర్చకు పెడతామన్నారు.
రెండు నెలల్లో భూమాత పోర్టల్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి రికార్డుల నిర్వహణ కోసం ధరణి ఫోర్టల్ ను తీసుకువచ్చింది. దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత ఫోర్టల్ ను తీసుకువస్తున్నామని, వినియోగంలోకి రావడానికి కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీ నుంచి భూమి రికార్డులను నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసి) కు బదలాయింపు జరుగుతున్నదని, పూర్తిగా బదిలీ అయి, లావాదేవీల నిర్వహణకు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి కి భూమాత ఫోర్టల్ బాధ్యతను అప్పగించి, రైతుల రికార్డులకు పూర్తి భధ్రత కల్పించామని అన్నారు.
జనవరిలో కౌలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమ
కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా భూమి లేని కౌలు రైతులకు ఎకరానికి రూ6 వేలు చొప్పున ఇస్తామని చెప్పామని, నూతన సంవత్సరం తొలి నెలలో అమలు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాధమిక అంచనా ప్రకారం సుమారు రూ.900 కోట్లకు అటు ఇటుగా లెక్కలు తేలాయని అన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదని, ఏపి లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పడిపోయిందనేది అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. గత మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూ వస్తున్నదని, వచ్చే మూడు నెలలు పెరుగుతుందని, రెవెన్యూ లోటు అంతగా లేదని అన్నారు. రైతులు తమ చేతికి పంట వచ్చిన తరువాత అందులో సగానికి పైగా భూములపై పెట్టుబడి పెడతారని ఆయన పేర్కొన్నారు. 2004లో వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఇదే పరిస్థితి ఉందని, సాగు విస్తీర్ణం పెరగడంతో ఆదాయం పెరిగి, ఆ మొత్తాన్ని భూముల మీద వెచ్చించారని ఆయన ఉదహరించారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగానే ఉందని, ఒకేసారి అమాంతం రేట్లు పెరగవని, ఆదాయం కూడా ప్రతి ఏడాది 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతుందన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదని, గత ప్రభుత్వం అమాంతం పెంచేసిందని ఆయన పరోక్షంగా వివరించారు. హైడ్రా పై మొదట్లో దుష్ప్రచారం జరిగినా, ప్రజలకు వాస్తవం తెలిసిందని అన్నారు.
కార్పొరేషన్ల అప్పులు ఎవరు చెల్లించాలి
రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.7.10 లక్షల కోట్లు అప్పులు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుడు సమాచారం ఇచ్చారని, సభా హక్కుల తీర్మానం ఇస్తామని బీఆర్ఎస్ సభ్యులు చెప్పారని అనగా… కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న వాటితో పాటు పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న మొత్తం అప్పులను ఉప ముఖ్యమంత్రి సభలో ప్రకటించారన్నారు. ఉదాహారణకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, వేలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని ఆయన గుర్తు చేశారు. దాదాపు అన్ని కార్పొరేషన్లు నష్టాల బాటలోనే ఉన్నాయని, వాటిని పరోక్షంగా ప్రభుత్వమే పూచికత్తుగా ఉంటుందన్నారు. కార్పొరేషన్ల ద్వారా ఎన్ని అప్పులు తెచ్చారో బీఆర్ఎస్ వాళ్లే చెబితే బాగుంటుందన్నారు.