దేశంలోనే అధికంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి
తెలంగాణలో సుమారు 46 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. దేశంలోనే ఇది అత్యధికమని పేర్కొన్నారు.
దేశంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు ఎక్కువ మొత్తంలో అక్రిడిటేషన్ కార్డులు అందిస్తున్నట్లుగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 46వేల మంది జర్నలిస్టులకు రాష్ట్రంలో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామన్నారు.
గురువారం హిమాయత్ నగర్ లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అందచేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 23,532 మందికి అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వంలో సుమారు 46 మందికి పైగా జర్నలిస్టులకు కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల గుర్తింపు కేవలం కార్డుల జారీ వరకే పరిమితం కాకుండా వారికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం అని వెల్లడించారు.
పారదర్శకమైన విధానాలను పకడ్బందీగా రూపొందించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. నూతన కార్డుల జారీలో కాస్త ఆలస్యం జరిగినా పారదర్శకమైన విధానాలను అవలంబించడానికే ప్రాధాన్యమిచ్చాం అని చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 30తో పాత కార్డుల గడువు ముగిసిన నేపథ్యంలో జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా నూతన కార్డుల జారీని ప్రజాప్రభుత్వం ప్రారంభించిందని పొంగులేటి తెలిపారు. ఈరోజు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో కార్డుల పంపిణీ లాంఛనప్రాయంగా ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు నుంచే జిల్లాల్లో కూడా అర్హులైన ప్రతి జర్నలిస్టులకు కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు.
నిర్ణీత వ్యవధిలో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేసి, కార్డు పొందిన జర్నలిస్టుల సంఖ్య ఫైనల్ చేసిన తరువాత వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సానుకూల నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక సంస్థ నుండి అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు, ఆ సంస్థ నుంచి మరో సంస్థకు వెళ్లినప్పుడు వారు తమ కార్డును రిప్లేస్మెంట్ చేసుకునే నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమీషనర్ ముకుందరెడ్డి, అక్రిడిటేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులు విరాహత్ అలీ, అధికారులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
పాములకు పేర్లు పెట్టడం అంత ‘వీజీ’ కాదు.. సుదీర్ఘ ప్రక్రియ తెలిస్తే షాకే
వేయి స్తంభాల గుడిలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram