Dharani Portal | రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు..సామాన్యులకు అందుబాటులో ధరణి పోర్టల్.. సిద్ధమవుతున్న ధరణి నివేదిక

మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు, సిద్ధమవుతున్న ధరణి నివేదిక.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం : రెవెన్యూ మంత్రి పొంగులేటి

  • By: Tech |    telangana |    Published on : Jun 14, 2024 11:10 PM IST
Dharani Portal | రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు..సామాన్యులకు అందుబాటులో ధరణి పోర్టల్.. సిద్ధమవుతున్న ధరణి నివేదిక

• రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు
• గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం – రెవెన్యూ మంత్రి పొంగులేటి
• మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ
• సిద్ధమవుతున్న ధరణి నివేదిక

విధాత ప్రత్యేక ప్రతినిధి :   గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత స్వయంగా తాను ఖమ్మం జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ ను పునర్ వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిందని ఈ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు.

శుక్రవారం నాడు డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండ రెడ్డి, ఎం.సునిల్ కుమార్, మధుసూదన్ లతో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…

గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ (ధరణి) ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని, ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ చేసిన సిఫారసులపై ఈరోజు జరిగిన సమావేశంలో సుధీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేకంటే ముందు అన్నీ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలోని RoR యాక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించింది. భూమి వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందని మంత్రిగారు వెల్లడించారు. లోపభూయిష్టమైన 2020 RoR చట్టాన్ని తద్వారా రూపొందించిన ధరణి పోర్టల్ ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్ లో మార్పులు-చేర్పులు చేపట్టబోతున్నామని మంత్రిగారు వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బి లో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.