విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, హామీల అమలులో తమ ప్రభుత్వం ముందుకే తప్ప వెనకడుగు వేయబోదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ చింతల్ బస్తీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమీర్‌పేటలో గృహజ్యోతి విద్యుత్తు పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన కరెంటును ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. విపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని, అనవసరమైన విమర్శలొద్దని సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్లతోపాటు మిగతా వాగ్దానాలు పూర్తిచేస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గత నెల 27న ప్రారంభించిన విషయం తెలిసిందేనన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నెలకు 200 యూనిట్లు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ వర్తింపజేస్తున్నామని వివరించారు.