రైతు భరోసా పేరుతో బీజేపీ మోసపూరిత యాత్రలు : మంత్రి పొన్నం ఫైర్

రైతు గోస–బీజేపీ భరోసా యాత్రలు రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు.

బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయకుండా ..పెట్రోల్, డీజిల్ ధరలతో సాగు వ్యయం పెరిగిపోయేలా చేసి..రైతులను సమస్యల పాలు చేస్తుందని..మరోవైపు తెలంగాణ బీజేపీ నాయకులు రైతు భరోసా పేరుతో యాత్రలు చేస్తున్నారని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ, ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు “రైతు గోస – బీజేపీ భరోసా” పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామాగా విమర్శించారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు, ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ సాంక్షన్ చేయడంలో, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదు అని పొన్నం ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చర్యలు చేపట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నాం అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో ₹8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు.

ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు అని పొన్నం విమర్శించారు. వ్యవసాయ చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురిచేసి, 700 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు రైతులకు భరోసా ఇస్తామని చెప్పడం నమ్మశక్యం కాదు అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైతులకు మాత్రం నయా పైస రుణమాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అన్నారు. మొక్కజొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం రూ.10 మాత్రమే MSP పెంచడం సిగ్గుచేటు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. రైతన్నలు బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీచార్జీలు చేయించిన ఘటనలు దేశం చూసిందన్నారు. రైతుల బాధలను పట్టించుకోని బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా యాత్రలతో కపట నాటకం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రైతులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి :

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నాయకుల భేటీ
Paddy Procurement | వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ళు పూర్తయ్యేనా!?

Latest News