విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం కొనసాగుతోందని, మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కు ఓటు వేసి దీవించాలని మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఆయన స్వగృహంలో ‘చెన్నూరు ప్రగతి ప్రస్థానం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో బాల్క మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి చేయడానికి తనకు మరో అవకాశాన్ని కల్పించాలని ప్రజలను కోరారు. నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, ఎనలేని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.
ప్రతి ఒక్కరికి రేషన్ సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. కరెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా, కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర. 400కే ఇస్తామన్నారు. ఎంతో కష్టపడి సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చాడని తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ చేతుల్లోనే ఉండేట్లు ప్రజలు మమ్మల్ని దీవించాలని కోరారు. టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజుతో దాడి చేయించారని ఆరోపించారు. డబ్బాలో ఓట్లు పడక ముందే ఇంత రౌడీయిజం చేస్తున్నవారు, రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.