కాంగ్రెస్ వి హింసా రాజకీయాలు: బాల్క సుమన్

  • Publish Date - November 1, 2023 / 12:24 PM IST
  • కత్తి దాడి ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు
  • దాడి చేయించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీవి హింసా రాజకీయాలు అని, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని హత్య చేసేందుకు కత్తితో దాడి చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బధావత్ సంతోష్ కు మంచిర్యాల శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, మాజీ శాసన సభ్యులు అరవింద రెడ్డితో కలసి వినతిపత్రం అందజేశారు.


ఈసందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే కల్లోలం అంటూ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్, హత్యా, హింసా రాజకీయాలు ఏవిధంగా జడలు విప్పి కరాళ నృత్యం చేశాయో మనకి జ్ఞాపకం ఉందన్నారు. అదేపంథాలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి నీచమైనదన్నారు. దీని వెనక ఉండి ఆయనపై హత్యాయత్నానికి దుండగుడిని పురిగొల్పిన వారందరి వివరాలు సేకరించాలని, వారి దాష్టీకాన్ని చట్టం ముందు నిలబెట్టి దోషులందరినీ చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రక్త చరిత్ర రాష్ట్రంలో కల్లోల పరిస్థితులను సృష్టించే కుట్రగా కనిపిస్తోందన్నారు.


1991లో ఒక ముఖ్యమంత్రిని గద్దె దించడం కోసం మత సామరస్యానికి మారుపేరైన హైదరాబాద్ నగరంలో మత కలహాలు రేపి, సుమారు 400 మందిని పొట్టన పెట్టుకున్న దుష్ట చరిత్ర కాంగ్రెస్ సొంతం అని విమర్శంచారు. నాలుగు ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు విచ్చలవిడిగా, అడ్డూ అదుపూ లేకుండా, చిన్న, పెద్ద చూడకుండా వాడుతున్న భాష తెలంగాణ భవిష్యత్తుకు మంచిది కాదన్న కేసీఆర్ మాట అక్షరసత్యమైందన్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ దూసుకు పోతుండడంతో నిస్పృహలోనే కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నదని విమర్శించారు.