బీఆర్ఎస్ మోసం చేసింది: ఎమ్మెల్యే రేఖా నాయక్

  • Publish Date - October 21, 2023 / 11:30 AM IST
  • 12 ఏళ్లు పార్టీకి సేవ చేశా
  • కేటీఆర్ స్నేహితుడికి టికెట్ ఇచ్చారు


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘బీఆర్ఎస్ తనను మోసం చేసింది. 12 సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేశా. కేటీఆర్ తన స్నేహితుడైన జాన్సన్ నాయక్ కోసం తనకు అన్యాయం చేశారు’ అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అందరికీ అందేవని పేర్కొన్నారు.


అభివృద్ధి పనులు మంజూరైనా, జాన్సన్ నాయక్ కోసం పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని పరోక్షంగా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి తీరుతానని పేర్కొన్నారు . కాంగ్రెస్ పార్టీతోనే ఖానాపూర్ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయకును ఓడించడమే తన లక్ష్యమని రేఖానాయక్ పేర్కొన్నారు.