Kavitha | బాకీ కార్డు బీఆర్ఎస్ రాజకీయ అంశం

కవిత: బీసీ కార్డు బీఎర్సీ రాజకీయ అంశం, రిజర్వేషన్ల లోపాలు, బతుకమ్మ వేడుకల్లో గిన్నిస్ రికార్డు విమర్శ.

Kavitha | బాకీ కార్డు బీఆర్ఎస్ రాజకీయ అంశం

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ బాకీ కార్డు బీఆర్ఎస్ రాజకీయ అంశం అని..కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్.. బీసీల సమస్యలపై కూడా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కు నాకు మధ్య ఇచ్చిపుచ్చుకొనేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
బీసీ బిల్లుల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాలతోనే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వమే కేసులు వేయించిందన్న ప్రచారం వినిపిస్తుందన్నారు. మరోవైపు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా రద్దవుతాయని..అభ్యర్థులు ఖర్చులు పెట్టుకోవద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటాన్ని కవిత తప్పుబట్టారు. ఆయన వెంటనే బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లులను ఆమోదించేలా ఈటల ఒత్తిడి చేయాలని కవిత కోరారు.

తప్పుల తడకగా స్థానిక రిజర్వేషన్లు

ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్థానిక రిజర్వేషన్లు ఆశాస్త్రీయంగా..హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు లేని చోట ఆ వర్గాలకు రిజర్వేషన్ రావడం పెద్ద వింత అని..ఇదంతా రిజర్వేషన్ల ప్రక్రియ లోపాలకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం లేని బీసీ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కల్పించి..ఆమోదం ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీల వారిగా ప్రభుత్వం కులగణన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు చేసిందన్నారు. ఈనెల 8న హైకోర్టు తీర్పు తర్వాత బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ జాగృతి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్దరించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు.

వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకల్లో కొత్త గిన్నిస్ బుక్ రికార్డు కొడుతాం

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10వేల మందితో బతుకమ్మ వేడుకతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించామంటున్నారని..మేం వచ్చే ఏడాది జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లక్ష మందితో బతుకమ్మ వేడుకతో కొత్త గిన్నిస్ బుక్ రికార్డు కొడుతామన్నారు. మేం రాష్ట్ర సాధనకు బతుకమ్మ వేడుకలను సాధనంగా వాడితే..రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్ రికార్డుల కోసం వేడుక నిర్వహించారని విమర్శించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విడ్డూరంగా అనిపించిందన్నారు. బతుకమ్మ వేడుకలకు హాజరైన నన్ను చింతమడక నుంచి లండన్ దాకా ప్రజలు ఆదరించారన్నారు.