కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు అన్యాయం: ఎమ్మెల్సీ ఎల్‌. రమణ

కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని, మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని బీఆరెస్ ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ఆరోపించారు.

  • Publish Date - April 28, 2024 / 03:26 PM IST

కరువైన సామాజిక న్యాయం

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని, మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని బీఆరెస్ ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేనేతలను ఆదుకుంటామని, వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక అందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీగా తాను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్ళానని, అయినప్పటికి స్పందన కనిపించడం లేదని విమర్శించారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఖరినే కారణమని ఆరోపించారు. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీసీలను చిన్నచూపు చూస్తున్నారన, కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలంతా ఏకమై కాంగ్రెస్‌ను ఓడించాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.50 వేల రుణం ఇచ్చారని, దసరా, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వడం ద్వారా చేనేతలకు ఉపాధి కల్పించి అండగా నిలబడ్డారని చెప్పారు. చేనేతలకు నెలకు రూ.2 వేల పింఛన్ ఇచ్చారని, బీమా ద్వారా చేనేతల కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేశారని తెలిపారు. గత నవంబర్ నుండే నేతన్నలకు రాష్ట్రంలో పనిలేకుండా పోయిందని ఆరోపించారు.