దమ్ముంటే మీరు బీసీని సీఎం చేయండి: బండి సంజయ్‌

  • Publish Date - November 2, 2023 / 09:09 AM IST

విధాత : తెలంగాణలో అధికారంలో వస్తే బీసీని సీఎం చేస్తామన్న బీజేపీ వ్యాఖ్యలను అపహాస్యం చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ చేశారు.


గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఓబీసీ కుల గణన చేస్తామని రాహుల్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించారని, ఇన్నాళ్లుగా ఓబీసీ కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారం పోయి, పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమవుతున్న తరుణంలో కాంగ్రెస్‌ చెబుతున్న బీసీ కులగణన కేవలం స్వార్ధ రాజకీయ ఆలోచన మాత్రమేనని విమర్శించారు.


తెలంగాణలో రెండు శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. మొన్న కేటీఆర్‌, నిన్న రాహుల్ గాంధీలు బీజేపీ బీసీ సీఎం ప్రకటనను ఎద్దేవా చేసిన తీరు వారికి బీసీల పట్ల ఉన్న చిన్నచూపును చాటుతుందన్నారు. బీసీలంతా ఏకమై దమ్ము చూపే సమయం వచ్చిందని, బీసీలను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆరెస్‌ పార్టీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.


బీజేపీ బీసీ సీఎం ప్రకటనకు కట్టుబడి ఉందని, పేదింటి బీసీ బిడ్డ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీకి దక్కిందని, దేశంలో 27 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. దళిత, ఆదివాసి, మైనార్టీ బిడ్డలను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్‌ బీసీని సీఎం చేయకపోతే ఆ పార్టీని బీసీలు రాజకీయ సమాధి చేయడం తద్యమన్నారు.