బీఆరెస్‌కు బిగ్ షాక్..కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం
బీఆరెస్‌కు ఎదురవుతున్న వలసల షాక్ ఈ దఫా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎదురైంది

గేట్లు ఓపెన్ చేశాం..ఇక బీఆరెస్ ఖాళీనే
విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌కు ఎదురవుతున్న వలసల షాక్ ఈ దఫా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎదురైంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆదివారం ఉదయం బీఆరెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ వెంటనే గాంధీభవన్‌లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆరెస్‌కు గుడ్‌బై కొట్టి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి సీఎం రేవంత్‌రెడ్డి, మున్షీలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు పొద్దునే గేట్లు ఓపెన్ చేశామని, ఇక బీఆరెస్ ఖాళీ కాబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంద రోజులు సీఎంగా నిబద్ధతొ పనిచేశానని, ఇక పీసీసీ చీఫ్‌గా నన్ను చూస్తారని, ఎన్నికల నగరా మోగింది కాబట్టి ఎన్నికల రూపం చూపిస్తానన్నారు. కోడ్ రానంత వరకు రోజుకు 18గంటలు చిత్తశుద్ధితో చిన్న తప్పు లేకుండా పనిచేశానన్నారు. పార్లమెంటు ఎన్నికల ముంగిట గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూలంగా కనిపిస్తుంది. దానం నాగేందర్‌కు సికింద్రాబాద్, రంజిత్‌రెడ్డికి చేవెళ్లకు ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశముందని సమాచారం.