కాంగ్రెస్ వైఫల్యాలతోనే బీజేపీకి ఎంపీ సీట్లు .. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహ వైఫల్యాలతోనే బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోగలిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదని, వామపక్షాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు

  • Publish Date - June 5, 2024 / 07:10 PM IST

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహ వైఫల్యాలతోనే బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోగలిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదని, వామపక్షాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. బీఆరెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి తప్పు చేసిందని, ఎక్కడైతే బీఆరెస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారో వాళ్లే ఓడిపోయారని చెప్పారు. బీఆరెస్, బీజేపీకి ఓట్లు పోలరైజ్ కాలేదని, బీఆరెస్‌కు ఎక్కడా డిపాజిట్లు కోల్పోలేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించినందుకు చంద్రబాబు ముందుగా జగన్ ఇంటికి వెళ్లి ధన్యవాదాలు చెప్పాలన్నారు.

అందరికంటే ఎక్కువగా ఎన్నికల్లో జగన్ కష్టపడ్డాడన్నారు. ఏపీలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయని, వామపక్షాల ఓట్ల శాతం పెరిగిందన్నారు.సంక్షేమ పథకాల ద్వారా.. అధికారం వస్తుందనుకోవడం తప్పు అని, అభివృద్ధి ద్వారా వస్తుందన్న విషయాన్ని జగన్‌ గుర్తించలేకపోయాడన్నారు. గత ఐదేళ్లు సంక్షేమ పాలన చేస్తే జగన్‌ ఓట్లు ఎందుకు కొనుక్కున్నాడని, జగన్‌ నిరంకుశ పాలన కారణంగానే ఆయన ప్రభుత్వం అధికారం కోల్పోయిందని నారాయణ విమర్శించారు. గెలిచిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు అభినందనలన్నారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకతనే ఎన్డీయే కూటమికి కలిసి వచ్చిందన్నారు. చంద్రబాబు, నితిష్ కుమార్ లేకపోతే ప్రధానిగా మోదీ కాలేరంటూ, ఏపీ ప్రయోజనాల కోసం ఖచ్చితమైన ప్రతిపాదన చంద్రబాబు కేంద్ర దగ్గర పెట్టాలని, విభజన హామీలు నెరవేర్చుకోవాలని, ఏపీకి నిధులు సాధించుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటును చంద్రబాబు గుణపాఠంగా తీసుకోవాలని నారాయణ చెప్పారు. హైదరాబాద్ మీద చంద్రబాబు అశాలు పెట్టుకోకుండా.. ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలని సీపీఐ నారాయణ చెప్పారు. కక్ష సాధింపులకు పోకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.