పర్యావరణ పరిరక్షణలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మైలురాయి: భట్టి
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ నగరం యొక్క రూపురేఖలను మార్చడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
విధాత, హైదరాబాద్ : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ నగరం యొక్క రూపురేఖలను మార్చడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. మూసీ నది పునరుజ్జీవనం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, అది నగరవాసుల సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ ఈ సందర్బంగా స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదు, వారిని భాగస్వాములను చేయడమేనని చాటి చెబుతూ అధికారులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్న ఉద్దేశంతో ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా అలైన్ మెంట్‌ను మార్చుకోవాలని కమిటీ సూచించింది. ఫేజ్-1 కోసం సుమారు రూ. 7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు సమకూర్చుకునేందుకు చర్చలు విజయవంతమయ్యాయని పేర్కొంది. హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న 21 కిలోమీటర్ల పరిధిలో, ఎటువంటి ఆవాసాలు లేని తొలి ఐదు కిలోమీటర్ల పనులను తొలి దశలో తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. 2026 ఆగస్టు నాటికి అన్ని అనుమతులు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించి, డిసెంబర్ 2027 నాటికి ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా స్పష్టం చేసింది. నదిలో నీటి నిల్వను పెంచి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ‘రబ్బర్ డ్యామ్’ (Obermeyer Spillway Gate Technology) నమూనాలను మంత్రులు పరిశీలించారు.
నదిలోని వ్యర్థాల తొలగింపు మరియు రివర్ బెడ్ ప్రొఫైలింగ్, వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్స్ , రెండు వైపులా రోడ్ల నిర్మాణం, ప్రధాన మురుగు నీటి కాలువలు, నాలాలు, బ్యారేజీల ఏర్పాటు, నార్సింగి నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, అభివృద్ధి, ప్రజల హితం సమాంతరంగా సాగాలని, ఐఐటి, జెఎన్ టియూ వంటి సంస్థల సాంకేతిక సహకారంతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు జరగాలని మంత్రులు సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram