Nalgonda : అకాల వర్షం.. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ అకాల వర్షం. వలిగొండ మార్కెట్ యార్డుతో పాటు ఐకేపీ కేంద్రాల్లోని రైతుల ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. రైతుల ఆవేదన.

Nalgonda : అకాల వర్షం.. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం

నల్లగొండ, విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు చోట్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వలిగొండ మండలంలోని మూసీ పరిసర ప్రాంతాల్లోని కాల్వ పక్కన ఉన్న ఇళ్లలోని వరద నీరు చేరుకోవడంతో అక్కడి ఇళ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా వలిగొండ మార్కెట్ యార్డ్‌లో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం తడిసిపోయింది, కాళ్లాల్లోని వడ్లు వర్షం దాటికి కొట్టుక పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాల్లో వర్షం దంచికొట్టడంతో ఐకేపీ కేంద్రాల్లో, రైతన్నలు ఆరబోసుకున్న వడ్లు కొట్టుకుపోయాయి. ఐకేపీ కేంద్రాల్లో నెలరోజులుగా ఆరబోసినా అధికారులు కాంటా పెట్టకపోవడంతో తమ ధాన్యం నీటిపాలు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్కిరేని, దుబ్బాక, ఎన్నారం, ఇస్మిల్లా, లక్ష్మపురం గ్రామాలలోని ఒక్కో ఐకేపీ సెంటర్స్ లో 100 లారీలకు పైగా ధాన్యం తడిసినట్లు సమాచారం.

ఈ సీజన్‌లో యాదాద్రి భునగిరి జిల్లాలో రెండు లక్షల 83 వేల 18 ఎకరాల విస్తీర్ణంలో జరిగిన సాగులో 7.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని, 80 లక్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ వానాకాలం సీజ‌న్‌లో 66.80 లక్షల ఎకరాలలో రైతులు వ‌రి పంట వేశార‌న్నారు. ఈ సీజ‌న్‌లో అత్యధికంగా 148.03 లక్షల మెట్రిక్ ట‌న్నుల దిగుబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. రూ. 23 వేల కోట్ల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో 1205 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామ‌ని మంత్రి ఉత్తమ్ తెలిపిన విషయం తెలిసిందే.