బీజేపీకి నందు జనార్ధన్ రెడ్డి రాజీనామా

  • Publish Date - November 6, 2023 / 12:50 PM IST
  • అదేబాటలో సందీప్ రమాకాంత్
  • మూడేళ్లు పార్టీని మోసిన.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టిన
  • కొత్తగా వచ్చిన విజయ్ కే టికెట్ ఇచ్చారు
  • 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల ముంగిట మెదక్ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మెదక్ పార్టీ టికెట్ ఆశించిన నందు జనార్దన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలోనే అదే నియోజకవర్గానికి చెందిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందీప్ రమాకాంత్ తో పాటు పలువురు పార్టీకి రాజీనామా చేశారు.


మెదక్ లోని జనార్దన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో రమాకాంత్ తో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించడంతో తనతో పాటు న్యాయవాది రాజశేఖర్ కలిసి పార్టీ కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మెదక్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర, ఇతర కేంద్ర మంత్రులు వస్తే ఖర్చులు పెట్టించి, వాడుకొని తమను వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


పార్టీలో ఇటీవల చేరిన విజయ్ కుమార్ కు టికెట్ ఇచ్చారని, అందుకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు నందు జనార్దన్ రెడ్డితో పాటు బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు సందీప్ రమాకాంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. తమతో పాటు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. మూడేళ్ల కిందట తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మెదక్ టికెట్ ఆశించి బీజేపీలో చేరానని చెప్పారు. అన్ని మండలాల్లో తానే అడ్వాన్స్ ఇచ్చి పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశానని చెప్పారు.


బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా న్యాయవాది రాజశేఖర్ తో కలసి రూ.20 లక్షలు ఖర్చు చేశామన్నారు. నందా రెడ్డి పరిణిత కూడా పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేశారని, తమను కాదని ఇటీవలనే బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిన విజయ్ కుమార్ కు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తనతో డబ్బులు ఖర్చు పెట్టించి, విజయ్ కు టికెట్ ఇప్పించారని ఆరోపించారు. బీజేవైఎం నేతలు రాకేష్ రెడ్డి, నవీన్ గౌడ్, కార్తీక్ రెడ్డి, బీజేవైఎం సోషల్ మీడియా ఇన్చార్జి కార్తీక్, సాత్విక్ రెడ్డి, పురం శేఖర్, రమేష్, చందు, భూమా గౌడ్ తదితరులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.


బీజేపీలో కుల ప్రస్తావన?


బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కులప్రస్తావనలు తెచ్చి, ఇక్కడ పార్టీలో పనిచేయని బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని రాజీనామా చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందీప్ రమాకాంత్ ముదిరాజ్ అన్నారు. తాను కూడా జిల్లాలో ఐటీ సెల్ కన్వీనర్ గా పనిచేసినట్లు చెప్పారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఒంటెద్దు పోకడకు పోతున్నారని విమర్శించారు. 2 రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని నందు జనార్దన్ రెడ్డి, సందీప్ రమాకాంత్ ఈ సందర్భంగా ప్రకటించారు.