విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ బీఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి సుధాకర్, జావేద్ అలీ, సుధాకర్ లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
రెండవ సెట్ నామినేషన్ పత్రాలను పద్మా దేవేందర్ రెడ్డి తరపున మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ చంద్రాపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మామిల్ల ఆంజనేయులు తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్వగ్రామం కోనాపూర్ పోచమ్మ ఆలయం, అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి వద్ద పూజలు నిర్వహించి, మెదక్ రిటర్నింగ్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఆదరించండి.. మరింత అభివృద్ధి చేస్తా: పద్మా దేవేందర్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశానని, ప్రజలు మరోసారి ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెదక్ నియోజకవర్గం ప్రజలు చేదోడు వాదోడుగా నిలిచి ముందు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంచానని అన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యిందన్నారు.
వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సాగునీటి కోసం ఏంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ కు లైనింగ్ చేసి పంట పొలాలకు సాగునీరు అందించామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం జరిగింది అన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి కలగానే మిగిలిపోతాయి అనుకున్న కార్యక్రమాలను మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రైల్వే, మెడికల్ కాలేజీని ఏడేళ్లలో తీసుకొచ్చామన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ఆడబిడ్డలాగా ఆశీర్వదిస్తున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మామిళ్ళ ఆంజనేయులు పాల్గొన్నారు.
జడ్పీటీసీ నుంచి అంచలంచెలుగా ఎదిగి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో పద్మా దేవేందర్ రెడ్డి ముందుండి పోరాటం చేశారు. 2001 తెరాస ఆవిర్భావం నుంచి టీఅర్ఎస్ లో కీలకంగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం తొలినాళ్లలో ఉమ్మడి రామాయంపేట మండల జడ్పీటీసీ గా గెలిచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామాయంపేట నియోజకవర్గం నుండి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి మైనంపల్లి వాణిపై విజయం సాధించారు.
అనంతరం తెలంగాణ కోసం రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో మైనంపల్లి హన్మంతరావుపై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జరిగిన డీలిమిటేషన్ లో రామాయంపేట నియోజకవర్గం రద్దయి, మెదక్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. 2010 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ నియోజకవర్గ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. మైనంపల్లి హన్మంతరావుపై స్వతంత్ర అభ్యర్థిగా పద్మా దేవేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో 20014 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పద్మా దేవేందర్ రెడ్డి కి దక్కింది.
ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి, సినీనటి విజయ శాంతిపై పద్మా దేవేందర్ రెడ్డి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి ఉప సభా పతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి పై గెలుపొందారు. వరసగా 2 సార్లు మెదక్ నుండి గెలుపొందిన పద్మా దేవేందర్ రెడ్డి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ముందుకు సాగుతున్నారు. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.