విధాత:కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘‘రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్‌రెడ్డి తెరాసలోకి వచ్చారు. యువనేత కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. కౌశిక్‌రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్నాను. కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పనిచేశారు. నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి అప్పట్లోనే 11 ఎంపీ సీట్లు గెలుచుకుంది.
ఎన్టీఆర్ అవకాశమిస్తే ఎమ్మె్ల్యే అయ్యాను. కష్టపడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉంది. గొర్రెల పెంపకం విషయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.