విధాత, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 3 గంటల విద్యుత్ వస్తుంది.. ఆలోచించి బీఅర్ఎస్ కి ఓటు వేయాలని ఆపార్టీ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. బర్లు, గోర్లు, గ్రామం స్థితిగతుల గురించి తెలియని కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ కు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కుచాన్ పల్లి, ముత్తాయి కోట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో, బతుకమ్మ, బోనాలతో పద్మా దేవేందర్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. కూచన్ పల్లిలో గొల్ల కురుమలు ఎమ్మెల్యేకు గొంగడి కప్పి గొర్రె పిల్లను బహూకరించారు. అనంతరం మహిళలతో కలిసి ఆమె నృత్యం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంత పెద్ద నియోజకవర్గం చిన్న పిల్లవాడు రోహిత్ రావు చేతిలో పెడితే ఉంటాద అని అన్నారు. గతంలో మైనంపల్లి హనుమంతరావుకు ఓటేసి గెలిపిస్తే ప్రజలకు చిక్కలే.. దొరకలే అన్నారు. ‘గెలిచిన ఏడాదికే హైదరాబాద్ వెళ్ళాడు. సొంత నిధులతో హాస్పిటల్ కట్టిస్తా అన్నడు.
ఇప్పటివరకు కట్టించలేదు. జూటా మాటలు, మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దు’ అని తెలిపారు. మెదక్ సెట్ కాదు అని చెప్పి హైదరాబాద్ కు వెళ్లి పదేళ్లైంది.. ఇప్పుడు మళ్ళీ తన కొడుకు స్వార్థ రాజకీయం కోసం మెదక్ యాదికి వచ్చిందా? అని మైనం పల్లి హనుమంతరావును ప్రశ్నించారు. ఉద్యమంలో నేను జై తెలంగాణ అంటే.. అతను నై తెలంగాణ అన్నారని పద్మా దేవేందర్ తెలిపారు. గతంలో 11 సార్లు కాంగ్రెస్ అధికాంలో ఉంటే కరెంటు కూడా సరిగా ఇవ్వలేదని అన్నారు.
ఘనపూర్ ఆనకట్టకు నీళ్లు ఇవ్వకపోతే ధర్నా చేసిన సంర్భాలు కోకొల్లలు అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఘనపూర్ ఆనకట్ట ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ కు లైనింగ్ చేసి చెక్ డ్యామ్ లు కట్టించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అంటున్నాడు.. దీనివలన రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, ఎంపీపీ నారాయణ రెడ్డి, ఆంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.