Pochampalli Srinivas Reddy | పొంగులేటి మీటింగ్ కు పోచంపెల్లి దూరం

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మినహా, ప్రతిపక్ష ఎమ్మెల్సీలూ, ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అభివృద్ధి పనులకు ఆమోదించడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Pochampalli Srinivas Reddy | పొంగులేటి మీటింగ్ కు పోచంపెల్లి దూరం

ఎమ్మెల్సీ అభివృద్ధి ప్రతిపాదనల పై వివక్ష !
జిల్లాలో గృహ నిర్మాణ సమస్యలపై చర్చ
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు

Pochampalli Srinivas Reddy | విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మినహా, ప్రతిపక్ష ఎమ్మెల్సీలూ, ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అభివృద్ధి పనులకు ఆమోదించడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారా? అంటే నిజమనే అభిప్రాయం ఈ సంఘటనతో బహిర్గతమవుతోంది. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో తమ ప్రతిపాదనలకు ఆమోదించడంలో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు జాప్యం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. నిధుల కొరత పేరుతో ప్రతిపక్ష, ముఖ్యంగా బీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు కొర్రీలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్ జిల్లాకు చెందిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఇదే అంశం పై శుక్రవారం లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ కావడంతో తాను ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాల్లో సగానికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగిలిన వాటిని పెండింగ్ లో పెట్టారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా తన హక్కులను ఉల్లంఘించారంటూ ఆ లేఖలో ఉల్లేఖించారు.

ఈ కారణంగా ఇంచార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో తన శాఖ పరిధిలోని సమస్యలపై నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశానికి తాను గైర్హాజరవుతున్నట్లు పోచంపెల్లి ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత సమావేశానికి తాను హాజరుకావడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదేమో? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చివరికి బీఆర్ఎస్ కు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కూడా హాజరుకాగా, పోచంపల్లి మాత్రం అసంతృప్తితో లేఖాస్ర్తం సంధించడం చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 2023 – 24 ఆర్ధిక సంవత్సరానికి అందుబాటులో ఉన్న నిధుల మేరకు రూ. 248.40 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు పోచంపెల్లి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనల్లో కేవలం సగం రూ.124.20 లక్షల మేరకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ కు ఇంచార్జ్ మంత్రి సూచించారని పేర్కొన్నారు. ఇది తన నియోజకవర్గ అభివృద్ధి పై ప్రభావం కనబరుస్తోందని, నిబంధనల మేరకు సమర్పించిన ఈ ప్రతిపాదనలను పెండింగ్ లో పెట్టడం దురుద్ధేశ్యపూరకమైందని పేర్కొంటూ ఈ సమావేశానికి హాజరుకావడంలేదని పోచంపెల్లి స్పష్టం చేశారు.

గృహ నిర్మాణ సమస్యల పై చర్చ

ఉమ్మడి వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గృహ నిర్మాణ, రెవిన్యూ సమస్యల పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో గృహ నిర్మాణాల తీరును వివరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొన్ని ఇండ్లు కేటాయిస్తే పార్టీ కోసం శ్రమించిన, అర్హులైన పేదలకు అందిస్తామంటూ ఇనుగాల వెంకట్రాం రెడ్డి ప్రతిపాదించారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, విప్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరామ్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని, కడియం, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీనాయక్, పల్లా రాజేవ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.!!!

Read More:

Meenakshi Natarajan | తెలంగాణలో మీనాక్షి ముద్రేదీ?.. కనిపించని కాంగ్రెస్ ఇంచార్జ్

బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !