విధాత: అమెరికాలోని చికాగోలో దుండగుడి దాడిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు పుచ్చా వరుణ్‌రాజ్ బుధవారం మరణించారు. తొమ్మిది రోజులుగా అక్కడి దవాఖానలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ రాజ్ (24) ఎంఎస్ చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు.
ఈ నెల 30న జిమ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో జోర్డాన్ ఆండ్రాడ్ అనే వ్యక్తి ఒక్కసారిగా వరుణ్‌రాజ్ కణతపై కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో పడిన వరుణ్‌ను హుటాహుటిన ఫోర్ట్ వెయిన్ హాస్పిటల్‌కు తరలించి.. చికిత్స అందించారు. నాటి నుంచి చికిత్స పొందిన అతడు బుధవారం తుదిశ్వాస విడిచారు.
మృతుడి తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వరుణ్‌రాజ్ మృతితో మామిళ్లగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.